మంత్రి వివాదాస్పద కామెంట్స్ తో ఇరకాటంలో నితీశ్ సర్కార్ 

మంత్రి వివాదాస్పద కామెంట్స్ తో ఇరకాటంలో నితీశ్ సర్కార్ 

పట్నా : బీహార్ వ్యవసాయశాఖ మంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత సుధాకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తన శాఖలో ఎంతోమంది దొంగలు ఉన్నారని, వారికి తానే సర్దార్‌ (చీఫ్) అంటూ కామెంట్స్ చేశారు. మంత్రి సుధాకర్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. అక్కడితో ఆగకుండా తనపైన కూడా సర్దార్లు ఉన్నారంటూ జేడీయూ, ఆర్జేడీ అగ్రనేతలను వివాదంలోకి లాగారు. 

సీడ్ కార్పొరేషన్ అందించే విత్తనాలను ఒక్క రైతు కూడా ఉపయోగించడం లేదని అన్నారు. అయినా సీడ్ కార్పొరేషన్ రూ.150 నుంచి 200 కోట్లు తీసుకుంటోందన్నారు. కైమూర్ లో ఈనెల 12న నిర్వహించిన ఓ సమావేశంలో మంత్రి సుధాకర్ సింగ్ ఈ కామెంట్స్ చేశారు. 

సుధాకర్ సింగ్ ఏమన్నారంటే..
‘నా వ్యవసాయ శాఖలో చోరీకి పాల్పడని విభాగం ఒక్కటీ లేదు. ఆ శాఖ నా నేతృత్వంలో నడుస్తోంది. వారందరికీ నేను సర్దార్‌ను. నాపైనా ఎంతోమంది సర్దార్లు ఉన్నారు. ప్రభుత్వం మారింది. పనిచేసే తీరు మాత్రం అదే. అంతా గతంలోలానే ఉంది’ అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 2013లో నీతీశ్‌ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన సుధాకర్ సింగ్ పై బియ్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. బీహార్‌లో నీతీశ్‌ కుమార్ జేడీయూ పార్టీ ఈ మధ్యే బీజేపీతో బంధం తెంచుకొని.. ఆర్జేడీతో జట్టుకట్టింది. ప్రస్తుతం జేడీయూ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ ఉన్నారు. 

వెనక్కి తగ్గేది లేదు
తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోబోనని మంత్రి సుధాకర్ సింగ్ స్పష్టం చేశారు. తాను మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందన్నారు. తనపై నమ్మకంతోనే ప్రజలు గెలిపించారని, వాళ్ల కోసమే పోరాడుతానని చెప్పారు.