ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‎పై కేసు నమోదు.. ఎందుకంటే..?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‎పై కేసు నమోదు.. ఎందుకంటే..?

పాట్నా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్‎పై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై వైశాలి జిల్లాలోని రఘోపూర్ పోలీస్ స్టేషన్‌‎లో ఆయనపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (అక్టోబర్ 11) రఘోపూర్‌ నియోజకవర్గంలో  ప్రశాంత కిశోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీకే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించి వందలాది వాహనాల కాన్వాయ్‌తో రఘోపూర్‌కు వచ్చాడని స్థానిక సబ్-డివిజనల్ ఆఫీసర్ (ఎస్‌డీఓ) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌డీఓ ఫిర్యాదు మేరకు పోలీసులు పీకేపై కేసు నమోదు చేశారు. 

కాగా, ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రచారంలో జోరు పెంచారు పీకే. ఈ క్రమంలోనే ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కంచుకోటైనా రఘోపూర్ నుంచి ప్రశాంత్ కిశోర్ తన ఎన్నికల క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. రఘోపూర్‎లో జన్ సూరజ్ పార్టీ కార్యకర్తలు పీకేకు ఘన స్వాగతం పలికారు. 

ఇదిలా ఉంటే.. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమి సీఎం క్యాండిడేట్ తేజస్వీ యాదవ్‎కు రఘోపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పెట్టని కోట. అతడు  ఈ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలో తేజస్వీకి పోటీగా ప్రశాంత్ కిశోర్ రఘోపూర్ నుంచి పోటీ చేయనున్నట్లు బీహార్ పాలిటిక్స్‎లో ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిశోర్ ఎంట్రీతో బీహార్ రాజకీయాల్లో ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. మొన్నటి వరకు అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమి మధ్యే పోటీ ఉండేది. 

ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ కూడా ఎన్నికల రేసులోకి రావడంతో బీహార్ ఎన్నికల దంగల్‎లో త్రిముఖ పోరు నెలకొంది. ప్రశాంత్ కిశోర్ అటు అధికార ఎన్డీఏ, ఇటు ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమికి సమదూరం పాటిస్తూ.. రెండు కూటములతో పోటీకి సై అంటున్నాడు. ఎన్నికల వ్యూహకర్తగా పలు రాష్ట్రాల్లో తన వ్యూహాలతో పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన ప్రశాంత్ కిశోర్.. రాజకీయ నాయకుడిగా తన సొంత రాష్ట్రంలో పీకే ఏ మేర ప్రభావం చూపుతాడో చూడాలి. 

కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. బీహార్‎లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2025, నవంబర్ 6న తొలి దశ, నవంబర్ 11న సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ నిర్వహించునుంది ఈసీ. 2025, నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. విజయం కోసం అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి.