ఆసుపత్రి ఆవరణలో అస్థిపంజరాలు

ఆసుపత్రి ఆవరణలో అస్థిపంజరాలు

పాట్నా: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ ఆసుపత్రికి సంబంధించి మరో దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది. ఇప్పటికే ఆ ఆసుపత్రిలో మెదడువాపు వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. 108 పిల్లలు మరణించిన ఘటన వార్తల్లోకి రాగా.. తాజాగా అదే ఆసుపత్రి( శ్రీకృష్ణ వైద్య కళాశాల) ఆవరణలో అస్థి పంజరాలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.

ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న  ఈ ఆసుపత్రి  వెనుక భాగంలో  వందలాది పుర్రెలు, అస్థిపంజరాలు బయటపడ్డాయి. దీంతో అక్కడి స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు . ఆ అస్థి పంజరాలు పేషెంట్లకు సంబంధించినవా..? లేదా ఇంకెవరినైనా చంపి ఇక్కడ పాతిపెట్టి ఉంటారా.? అన్న అనుమానాలతో హడలిపోతున్నారు.

అయితే  ఆ ఎముకల గూళ్లు పేషెంట్లవే అన్ని ఆసుపత్రి కేర్ టేకర్ జనక్ పాస్వాన్  మీడియాకు తెలిపారు. పోస్టు మార్టం తర్వాత  ఆ డిపార్ట్ మెంట్ చెందిన వారు మృతదేహాలను ఇలా బహిరంగం పారేసినట్టుగా తెలుస్తోందన్నారు. దీనిపై  ఆసుపత్రి సూపరింటెండెంట్‌  ఎస్‌కే షాహి సమగ్ర దర్యాప్తును కోరనున్నట్టు పాస్వాన్ చెప్పారు.

ఈ ఘటనపై సమాచారమందుకున్న  పోలీసు దర్యాప్తు బృందం సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించింది. గుర్తు తెలియని శవాలను ఇక్కడ కాల్చేసినట్లు అర్థమవుతోందని బృందంలోని ఉన్నతాధికారి ఒకరు అన్నారు. దీనిపై విచారణ జరుపుతామని అన్నారు.