పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా.. ప్రతిపక్షాల తీరుపై స్పీకర్ ఆగ్రహం

పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా.. ప్రతిపక్షాల తీరుపై స్పీకర్ ఆగ్రహం

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడుస్తోంది. సోమవారం (జూలై 28) కూడా లోక్ సభ, రాజ్య సభలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. సభ మొదలు కాగానే విపక్షాలకు ఆందోళనకు దిగాయి. బీహర్‎లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR)కు వ్యతిరేకంగా ఉభయ సభల్లో విపక్షాలకు ఆందోళనకు దిగాయి. స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌‎పై చర్చకు పట్టుబట్టాయి. ప్రతిపక్షాల ఆందోళనతో లోక్ సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ వారించే ప్రయత్నం చేశారు. విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. 

ALSO READ | ఇవాళ పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్ పై చర్చ

రాజ్య సభలో కూడా ఇదే అంశంపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. ఉభయ సభలు తిరిగి 12 గంటలకు ప్రారంభం కాగా.. ప్రతిపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. దీంతో మధ్యాహ్నం 1 వరకు లోక్‌సభ, మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల తీరుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను సజావుగా నడవనివ్వాలని ప్రతిపక్షాలను హెచ్చరించారు. మరోవైపు సోమవారం (జూలై 28) లోక్ సభలో ఆపరేషన్ సింధూర్‎పై చర్చ మొదలు  కానుంది. 

ఆపరేషన్ సిందూర్‎పై చర్చకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి రెండు గంటల సమయం కేటాయించింది ప్రభుత్వం. లోక్ సభలో కాంగ్రెస్ తరుఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, గౌరవ్ గొగొయ్ తదితరులు మాట్లాడనున్నారు. ఇక ప్రభుత్వం తరుఫున కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, జైశంకర్, కిరణ్ రిజుజు చర్చలో పాల్గొననున్నారు. ఆపరేషన్ సిందూర్ పై ఉభయ సభల్లో చర్చకు ప్రభుత్వం 16 గంటల సమయం కేటాయించిన విషయం తెలిసిందే.