'యూనివర్సిటీ పేపర్ లీక్'.. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టిన ఆర్. నారాయణమూర్తి

'యూనివర్సిటీ పేపర్ లీక్'..  విద్యా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టిన ఆర్. నారాయణమూర్తి

ప్రస్తుత సమాజంలో పెరిగిపోతున్న  సామాజిక సమస్యలపై తన సినిమాల ద్వారా నిరంతరం పోరాడుతున్న ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి ( R. Narayana Murthy ) .  ఎన్నో సామాజిక సృహతో కూడిన చిత్రాలను రూపొందించారు. తన నటనతో ప్రేక్షకుల మెప్పించారు.  నాలుగు సంవత్సరాల తర్వాత మరోసారి తన గొంతును బలంగా వినిపించేందుకు సిద్ధమైయ్యారు.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఎగ్జామ్ పేపర్ లీకేజీల (Exam paper leakage) సమస్యపై ఆయన రూపొందించిన చిత్రం  'యూనివర్సిటీ పేపర్ లీక్' (University Paper Leak). ఈ సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా వరంగల్ లో  ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నారాయణమూర్తి గారు కీలక వ్యాఖ్యలు చేశారు.

వ్యాపార రంగంగా విద్యా వ్యవస్థ
యూనివర్సిటీలలో పేపర్ లీకేజీలు, స్థితిగతులపై రూపొందించిన చిత్రమే 'యూనివర్సిటీ పేపర్ లీక్' అని నారాయణమూర్తి తెలిపారు. భారతీయ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు సేవా రంగంగా ఉన్న విద్య, ఇప్పుడు పూర్తిస్థాయిలో వ్యాపార రంగంగా మారిపోయిందన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల ముసుగులో తల్లిదండ్రుల ఆలోచనా విధానాన్ని మార్చేస్తున్నాయని, కష్టపడి చదువుకుంటున్న విద్యార్థులకు ఇది తీరని అన్యాయం చేస్తుందని నారాయణమూర్తి మండిపడ్డారు.

పేపర్ లీకేజీల పర్యవసానాలు
గుజరాత్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలలో పేపర్ లీకేజీలు బయటపడటం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను స్పష్టం చేస్తోంది. ఈ లీకేజీల వల్ల అనర్హులు ఉద్యోగాలు పొంది, అర్హులైన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీతో ఉద్యోగం పొందిన వాళ్లు ఆపరేషన్ చేస్తే ప్రాణాలు పోవా? అని ప్రశ్నించారు. ఇటువంటి అక్రమాల వల్ల సమాజం ఎంతటి ప్రమాదంలో పడుతుందో హెచ్చరించారు.

విద్యా, వైద్యం జాతీయం కావాలి
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని, జ్ఞానం అందరి సొత్తు కావాలి అని నారాయణమూర్తి అన్నారు. విద్య, వైద్యం జాతీయం కావాలి  డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీల సమస్యను, విద్యార్థులు, సమాజంపై దాని ప్రభావాన్ని ఈ సినిమాలో స్పష్టంగా చూపించామని ఆయన తెలిపారు. విద్యా వ్యవస్థలోని వ్యవస్థాగత సమస్యలు, ఇలాంటి లీకుల పర్యవసానాలను వెలుగులోకి తేవడమే ఈ చిత్ర ప్రధాన లక్ష్యమని చెప్పారు.

ఆగస్టు 22న విడుదలవుతున్న 'యూనివర్సిటీ పేపర్ లీక్' చిత్రాన్ని ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించి, సమాజానికి మేలు చేసే ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించాలని ఆర్. నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు.  సామాజిక స్పృహకు నిదర్శనంగా నిలిచే  ఆర్ నారాయణ మూర్తి సినిమాలు సమాజంలో మార్పునకు దోహదపడే విధంగా ఉంటాయని ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు.