
- ఇప్పటికే వారెంట్ కూడా జారీ చేసిన కోర్టు
పాట్నా: కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పొలిటీషియన్‌ను సరెండర్ కావాలంటూ కోర్టు ఆదేశించింది.. డెడ్‌లైన్ కూడా పెట్టింది. ఆగస్టు 16న దానాపూర్ కోర్టులో లొంగిపోవాల్సిన ఆ పొలిటీషియన్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి మంత్రిగా ప్రమాణం చేశాడు. ఆయనే ఆర్జేడీ ఎమ్మెల్సీ, బీహార్ న్యాయ శాఖ మంత్రి కార్తికేయ సింగ్. మంత్రివర్గంలో కార్తికేయకు చోటుకల్పించడంపై ప్రతిపక్షాలు మండిపడుతుండగా.. సీఎం నితీశ్ మాత్రం కార్తికేయపై వారెంట్ జారీ అయిందనే విషయం తనకు తెలియదని సింపుల్‌గా తేల్చేశారు. తనపై ఎలాంటి కేసు లేదని, అఫిడవిట్లో అన్ని వివరాలు పొందుపరచానని కార్తికేయ సింగ్ వివరణ ఇచ్చాడు. అరెస్ట్ వారెంట్ జారీ అయిన వ్యక్తికి మంత్రి పదవి ఎట్లిస్తరని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ నితీశ్ కుమార్‌పై మండిపడ్డారు. వెంటనే కార్తికేయను మంత్రివర్గంలో నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
ఎవరీ కార్తికేయ..
కార్తికేయ సింగ్‌పై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. ఆర్జేడీ నుంచి కార్తికేయ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే, ఆర్జేడీ నేత అనంత్ కుమార్‌కు ముఖ్య అనుచరుడు. ఆర్జేడీతో కలిసి నితీశ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కార్తికేయకు బీహార్ మంత్రివర్గంలో చోటుదక్కింది. నితీశ్ఆయనకు న్యాయ శాఖ బాధ్యతలను అప్పగించారు.