బిహార్‌‌లో 7.42 కోట్ల మంది ఓటర్లు..పాట్నాలో పెరిగిన 1.63 లక్షల ఓటర్లు

బిహార్‌‌లో 7.42 కోట్ల మంది ఓటర్లు..పాట్నాలో పెరిగిన 1.63 లక్షల ఓటర్లు
  • తుది ఓటర్ల జాబితాను రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం
  • పాట్నాలో పెరిగిన 1.63 లక్షల ఓటర్లు

పాట్నా: బిహార్‌‌లో అనేక వివాదాల మధ్య స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌‌ఐఆర్‌‌)ను పూర్తి చేసిన ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను మంగళవారం ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం..రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.  ఎస్‌‌ఐఆర్‌‌ ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 1న డ్రాఫ్ట్ జాబితాలు విడుదల చేశారు.

 మరణించిన ఓటర్ల , వలసలు, ఫేక్ డాక్యుమెంట్లు వంటి వివిధ కారణాల వల్ల 65 లక్షల మంది ఓటర్లను తొలగించి.. మొత్తం 7.24 కోట్ల మంది ఓటర్లతో ముసాయిదా జాబితాను రెడీ చేశారు. దీనిపై పలు పార్టీలు, వ్యక్తులు దాఖలు చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నెలరోజుల పాటు మూల్యాంకనం చేసి మళ్లీ 3.66 లక్షల మంది ఓటర్లను డ్రాఫ్ట్ జాబితా నుంచి తొలగించారు. దానికి మరో  21.53 లక్షల మంది అర్హులను చేర్చి తాజాగా తుది జాబితాను రిలీజ్ చేశారు.

 ఇందులో  ఒక్క పాట్నాలోనే 1.63 లక్షలకు పైగా ఓటర్లు పెరిగారని ఎన్నికల సంఘం వెల్లడించింది.  పాట్నా జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా..ఆగస్టు 1న డ్రాఫ్ట్ జాబితాలో అక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య  46.51 లక్షలుగా ఉంది. కొత్తగా 1,63,600 ఓటర్లను చేర్చడంతో ఆ సంఖ్య 48.15 లక్షలకు పెరిగిందని పాట్నా జిల్లా యంత్రాంగం తెలిపింది. ప్రజలు voters.eci.gov.in లింక్‌‌పై క్లిక్ చేయడం ద్వారా వారి పేర్లను చూసుకోవచ్చని ఎన్నికల సంఘం సోషల్ మీడియా ద్వారా పేర్కొంది.