జనతా గ్యారేజ్.. ఇచ్చట జీవితాలూ బాగు చేయబడును

జనతా గ్యారేజ్.. ఇచ్చట జీవితాలూ బాగు చేయబడును

బైక్​లనే కాదు.. జీవితాలనూ బాగు చేస్తున్నారు ఈ మెకానిక్​లు. చీకటి పడగానే షెడ్డు మూసేసి మందు దుకాణాలకు క్యూ కట్టే తోటి మెకానిక్​లను దారిలోకి తెస్తున్నారు. జీవితం అంటే జల్సాలే కాదు..  కుటుంబ బాధ్యతలు ఉంటాయంటూ… హితబోధ చేస్తున్నారు. సంపాదనలో సగం డబ్బులను ఖర్చు చేస్తూ.. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. అంతేకాదు.. రక్తదాన శిబిరాలు, పేదలకు అన్నదానం వంటి సామాజిక కార్యక్రమాలు  సైతం చేస్తున్నారు.

ఒక్కటై

అనుకోని ప్రమాదాల్లో గాయపడటం.. వృత్తినే నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడటం.. మెకానిక్స్​ను​  ఆలోచింపజేసింది. తమ రక్షణ కోసం ఏదైనా చేయాలని భావించారు. మెకానిక్​లు కలిసి నాలుగేళ్ల కిందట ‘ఖమ్మం కార్పొరేషన్​ టూ వీలర్స్’  పేరుతో యూనియన్​ పెట్టుకున్నారు. ఇందులో రెండు వందల యాభై మంది సభ్యులు ఉన్నారు. ప్రతి నెలా కొంత డబ్బు పోగు చేసి ‘కార్పస్​ ఫండ్’ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పది లక్షల రూపాయల ఫండ్​ను బ్యాంక్​లో డిపాజిట్​ చేశారు. మెకానిక్​ కుటుంబాలకు ఏదైనా కష్టం వస్తే, ఇందులో నుంచి ఖర్చు చేస్తారు.  తోటి మెకానిక్​లు ఆపదలో ఉన్నారని తెలియగానే వెంటనే స్పందిస్తారు. అనుకోని ప్రమాదంలో ఎవరైనా చనిపోయినా, కాళ్లు, చేతులు విరిగినా, ఆర్థికంగా నష్టపోయినా.. అండగా నిలబడతారు. వీరి సేవా కార్యక్రమాలు ఖమ్మం జిల్లాకే పరిమితం చేయకుండా, వరంగల్, నల్లగొండ, కరీంనగర్​ జిల్లాలకు కూడా విస్తరించారు.

జీవితాల్లో వెలుగులు

యూనియన్​ సభ్యులు ఎవరైనా చనిపోతే నగర, జిల్లా యూనియన్​లు కలిసి యాభై వేల సాయం అందిస్తాయి. ఆడబిడ్డ పెళ్లికి పది వేలు, ప్రమాదానికి గురైతే.. పదిహేను వేలు, పిల్లల పైచదువులకు ఇరవై ఐదు వేలు.. ఇలా అవసరాన్ని బట్టి సాయం చేస్తారు. ఈ నాలుగేళ్లలో వంద మంది మెకానిక్​ కుటుంబ సభ్యులకు లక్షల్లో సాయం అందించారు. రక్తదాన శిబిరాలు, వృద్ధాశ్రమాల్లో అన్నదానం లాంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ, ‘చేయి చేయి కలిస్తే కొండంత కష్టమైనా అలవోకగా ఎదుర్కోవచ్చు’ అనే మాటను నిజం చేస్తోంది ఈ యూనియన్​.

యూనియన్ ఆదుకుంది

నా భర్త వెంకటేశ్వర్లు మెకానిక్. అనారోగ్యంతో చనిపోయాడు. యూనియన్ ఇరవై వేలు ఇచ్చింది. ఆ తర్వాత మా అమ్మాయి పెళ్లికి ఐదువేలు ఇచ్చింది. యూనియన్​ సహకారం మరువలేనిది. ఇప్పుడు నేను నా కొడుకు మెకానిక్​ షాపును నడుపుతున్నం. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నం. మేం కూడా యూనియన్​కు​ సాయం చేస్తం.  – రాధ, ఖమ్మం