
బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసు విచారణ నుంచి జస్టిస్ బేలా త్రివేది తప్పుకున్నారు. దీంతో ఇవాళ విచారణ చేపట్టాల్సి ఉండగా.. కేసు విచారణ వాయిదా పడింది. అయితే జస్టిస్ త్రివేది ఎందుకు తప్పుకున్నారనే విషయంపై ఎలాంటి కారణాలను వెల్లడించలేదు. బిల్కిస్ బానో అత్యాచార ఘటనకు సంబంధించి 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేయటాన్ని సవాల్ చేస్తూ.. బిల్కిస్ సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశారు. బిల్కిస్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇప్పుడు జస్టిస్ బేలా త్రివేదీ కేసు విచారణ నుంచి తప్పుకోవడం అనుమానాస్పదంగా మారింది. ఈ పిటిషన్‌ను మరో బెంచ్‌కి అప్పగించిన తర్వాత.. విచారణ తిరిగి ప్రారంభం కానుంది.
గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆమె కుటుంబ సభ్యులతో సహా పలువురిని హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు అనంతరం నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకుని.. జీవిత ఖైదుగా మార్చాయి. తాజాగా 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా... గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ పాలసీ ప్రకారం ఆ పదకొండు మందిని విడుదల చేసింది. దోషులను విడుదల చేయటాన్ని సవాల్ చేస్తూ.. బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో రెండు వేరు వేరు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆమె ఆరోపించారు.