ట్రాఫిక్ దెబ్బ అంటే ఇదీ : లోకల్ రైళ్లో బడా వ్యాపారవేత్త

ట్రాఫిక్ దెబ్బ అంటే ఇదీ : లోకల్ రైళ్లో బడా వ్యాపారవేత్త

హీరానందానీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ నిరంజన్ హీరానందినీ ఓ సాధారణ ప్రయాణికుడి లాగా ఓ లోకల్ రైలులో ప్రయాణించారు. దీనికి గల కారణం ట్రాఫిక్.. అవును.. దేశ అర్థిక  రాజధాని ముంబైలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.  ఈ భయకంరమైన ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి ఆయన రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారు. హీరానందినీ సడన్ గా ఈ నిర్ణయం తీసుకోలేదు.  

ముంబైలోని ఉల్లాస్ నగర్‌లోని సీహెచ్‌ఎం కళాశాలలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు రోడ్డు మార్గంలో వెళ్తే ట్రాఫిక్‌ కారణంగా సమయం వృథా అవుతుందని భావించిన  హీరానందినీ ..  లోకల్‌ ట్రైన్‌లో వెళ్లాలని ముందుగానే  నిర్ణయం తీసుకున్నారు. ఏసీ కోచ్ లో టికెట్ తీసుకున్నారు. 30 నిమిషాల తన ప్రయాణంలో హీరానందని తోటి ప్రయాణికులతో సంభాషించారు. తన అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. దీనికి  సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నందుకు హీరానందినీని ప్రశంసించారు.  

నిరంజన్ హీరానందినీ తన సోదరుడు  సురేంద్రతో కలిసి హీరానందనీ గ్రూప్‌ను స్థాపించారు. ఇదోక రియల్ ఎస్టేట్ సంస్థ.  నిరంజన్ హీరానందని ఉపాధ్యాయునిగా తన వృత్తిని ప్రారంభించి, వివిధ వెంచర్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే, రియల్ ఎస్టేట్ పరిశ్రమ అతనికి గొప్ప విజయాన్ని అందించింది.  హీరానందనీకి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈయన  ఫోర్బ్స్ రిచ్ లిస్ట్‌లో 79వ స్థానంలో ఉన్నారు.