సర్కార్‌‌ బిల్లులిస్తలే.. కాంట్రాక్టర్లు పనులు చేస్తలే..

సర్కార్‌‌ బిల్లులిస్తలే.. కాంట్రాక్టర్లు పనులు చేస్తలే..
  • జిల్లాలో ఎక్కడికక్కడే ఆగిన ‘మన ఊరు మన బడి’ పనులు
  • హనుమకొండలో 224 ఎంపికైతే 16 స్కూళ్లలోనే పూర్తి
  • నాబార్డ్‌‌ నిధులను ఇతర పనులకు మళ్లించారన్న ఆరోపణలు
  • ఎంక్వైరీ చేస్తున్న నాబార్డ్ ప్రతినిధులు

హనుమకొండ, వెలుగు :  సర్కారు బడులకు కార్పొరేట్‌‌ హంగులతో పాటు, మౌలిక వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు – -మన బడి’, మన బస్తీ – మన బడి’ పనులు ముందుకు సాగడం లేదు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఎక్కడి పనులు అక్కడే వదిలేస్తున్నారు. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన ‘మన బస్తీ -మన బడి’ పనుల కోసం నాబార్డు నిధులు తీసుకొచ్చినా బిల్లులు చెల్లించకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాంక్‌‌ నుంచి ఫండ్స్‌‌ డ్రా చేసినప్పటికీ యూసీలు సబ్మిట్‌‌ చేయకపోవడంపై నాబార్డు ప్రతినిధులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే హనుమకొండ, వరంగల్‌‌ జిల్లాల్లోని పలు స్కూళ్లను విజిట్‌‌ చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. 

ఎంపికైనవి 224 స్కూళ్లు.. పనులు పూర్తయినవి 16

‘మన ఊరు -మన బడి’, ‘మన బస్తీ -మన బడి’ పథకానికి సమగ్ర శిక్షా అభియాన్, అసెంబ్లీ నియోజకవర్గ డెవలప్‌‌మెంట్‌‌ ఫండ్స్‌‌, జిల్లా, మండల పరిషత్‌‌తో పాటు ఉపాధి హామీ నిధులు వినియోగించాలని సర్కార్‌‌ నిర్ణయించింది. మొత్తం రూ. 7,289.54 కోట్లతో మూడు విడతల్లో రాష్ట్రంలోని 26,065 స్కూళ్లను అభివృద్ధి చేయాలని భావించారు. ఈ పనుల్లో భాగంగా స్కూళ్లలో తాగునీటి సౌకర్యం, వంట గదులు, మరుగుదొడ్లు, కాంపౌండ్‌‌ వాల్స్‌‌, ఫర్నీచర్‌‌, అడిషనల్‌‌ క్లాస్‌‌ రూమ్స్‌‌ నిర్మించనున్నారు. తొలివిడతలో రాష్ట్ర వ్యాప్తంగా 9,123 స్కూళ్లను ఎంపిక చేయగా, హనుమకొండ జిల్లాలో 224 స్కూళ్లను గుర్తించి రూ.42 కోట్లతో ప్రపోజల్స్‌‌ రెడీ చేశారు. పథకం ప్రారంభించి రెండేళ్లు అవుతున్నా ఇప్పటివరకు కేవలం 16 స్కూళ్లలోనే పనులు కంప్లీట్‌‌ అయ్యాయి. 

ఇతర పనులకు నాబార్డు నిధులు ?

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని స్కూళ్లలో 85 శాతం నాబార్డ్‌‌ ఫండ్స్‌‌, 15 శాతం స్టేట్‌‌ మ్యాచింగ్‌‌ గ్రాంట్‌‌తో పనులు చేయించాల్సి ఉంది. నాబార్డ్‌‌ నుంచి తెచ్చిన నిధులకు సంబంధించిన యుటిలైజేషన్‌‌ సర్టిఫికెట్లు (యూసీలు) సబ్మిట్‌‌ చేస్తే ఎలాంటి పెండింగ్‌‌లు లేకుండా ఫండ్స్‌‌ రిలీజ్‌‌ అవుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. గవర్నమెంట్‌‌ స్కూళ్ల డెవలప్‌‌మెంట్‌‌ కోసం నాబార్డు నిధులు దాదాపు రూ.1600 కోట్లు కేటాయించగా, ప్రభుత్వం ముందస్తుగా పావు వంతు నిధులు తీసుకొచ్చినట్లు సమాచారం. ఇందులో ఎక్కువ మొత్తం నిధులు మన బస్తీ -మన బడి పనులకు కాకుండా ఇతర పనులకు మళ్లించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్లే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో ఆలస్యం అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బిల్లులు పెండింగ్‌‌లో ఉండడంతో పాటు, గతంతో టెండర్‌‌ ఖరారు చేసిన రేట్లు ఇప్పుడు గిట్టుబాటు కాకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాడం లేదని హెడ్‌‌మాస్టర్లు చెబుతున్నారు.

ఎంక్వైరీ చేస్తున్న నాబార్డు ప్రతినిధులు

నాబార్డ్‌‌ నుంచి ఫండ్స్‌‌ వచ్చినా క్షేత్రస్థాయిలో ఎక్కడా పనులు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. నాబార్డు నుంచి తీసుకొచ్చిన నిధులు ఇతర పథకాలకు మళ్లించారన్న ఆరోపణలు వినిపిస్తుండడంతో సంబంధిత ఆఫీసర్లు రంగంలోకి దిగారు. జులై నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని పలు స్కూళ్లను విజిట్‌‌ చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట హనుమకొండ జిల్లా పరిధిలో ఐదు, వరంగల్ జిల్లా పరిధిలో మరో ఐదు స్కూళ్లను పరిశీలించినట్లు సమాచారం. సదరు స్కూళ్ల హెడ్‌‌మాస్టర్లతో మాట్లాడి పనులు జరగకపోవడానికి గల కారణాలను ఆరా తీసినట్లు తెలిసింది.