
బీ9 బేవరేజెస్. ఈ పేరు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ.. బీరా 91 బీరు మాత్రం మద్యం ప్రియులు చాలాసార్లు బార్లలో, వైన్స్లో చూసే ఉంటారు. చూడటానికి అచ్చం మంకీలా ఉండే లోగోతో ఈ బీర్ బార్లలో, వైన్స్లో దర్శనమిస్తుంటుంది. కేవలం బాటిల్స్ మాత్రమే కాదు టిన్స్లో కూడా అందుబాటులో ఉండే ఈ బీరును కొందరు మద్యం ప్రియులు ట్రై చేసి ఉంటారు. ఈ బీరును ఇష్టంగా తాగే వారికి మాత్రం ఇప్పుడో చేదు వార్త చెప్పక తప్పదు. ఈ బీరు కంపెనీలో పనిచేస్తున్న 250 మంది ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు.
దీంతో.. చల్లటి బీర్లు తయారు చేస్తున్న ఈ ఉద్యోగుల కడుపు మండింది. ఈ బీరు కంపెనీ ఫౌండర్ అంకుర్ జైన్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ బీరు కంపెనీకి ఫండింగ్ ఇస్తున్న జపనీస్ బేవరేజ్ కంపెనీ బోర్డుకు, ఈ బేవరేజెస్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన టాప్ ఇన్వెస్టర్స్ను ఈ కంపెనీ ఉద్యోగులు ఆశ్రయించారు. అంకుర్ జైన్ వైఖరి పట్ల తాము తీవ్ర అసంతృప్తితో ఉన్నామని, ఉన్నపళంగా అతనిని పక్కనపెట్టేయాలని, మేనేజ్ మెంట్ రోల్లో సమర్థులను ఉంచాలని అభ్యర్థించారు.
బీ9 బేవరేజెస్ కంపెనీకి భారీగా అప్పు ఇచ్చి ఆదుకుంటున్న Anicut Capitalకు ఉద్యోగులు సంతకాలు చేసి పిటిషన్ కూడా పంపారు. బీరా91 కంపెనీలో అంకుర్ జైన్కు, అతని కుటుంబానికి 17.8 శాతం వాటా ఉంది. కిరిన్ హోల్డింగ్స్కు అత్యధికంగా 20.1 శాతం వాటా ఉంది. శాలరీలు ఆపేస్తున్నాడని, టీడీఎస్ డిపాజిట్ చేయడం లేదని.. ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి ఉందని.. నవంబర్ 2024 నుంచి రీయింబర్స్మెంట్స్ పెండింగ్లో ఉన్నాయని బీ9 బేవరేజెస్ ఉద్యోగులు పిటిషన్లో చెప్పుకొచ్చారు.
ALSO READ : ప్రపంచం అంతం అవుతుందని జుకర్‌బర్గ్ లాంటి టెక్ దిగ్గజాలు డిసైడ్ అయ్యారా..
ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం పెండింగ్ శాలరీ 50 కోట్లకు పైగానే ఉందని తెలిసింది. అంతేకాకుండా.. ఉద్యోగులను లేఆఫ్స్ చేసి రోడ్డున పడేశాడని అంకుర్ జైన్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వివాదం ప్రభావం బీరా 91 బీర్ల ఉత్పత్తిపై పడే అవకాశం ఉంది. ఉద్యోగుల అసంతృప్తి చల్లారకపోతే బీర్ల తయారీ నిలిచిపోయే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో.. ముందు ముందు బీరా 91 బీర్లు దొరుకుడు కష్టమేనని ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బేవరేజెస్ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి సెప్టెంబర్ నెలలోనే బీరా 91 బీర్ల ఉత్పత్తి నిలిచిపోయింది. గతేడాది 700 మంది ఉద్యోగులు ఉండగా ఈ సంఖ్య 260కి పడిపోయింది. ఈ ఉన్న ఉద్యోగులతోనే ఇన్నాళ్లూ నెట్టుకొచ్చినప్పటికీ ఇకపై ఈ బీర్ ప్రొడక్షన్ కష్టమేనని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.