టీఎంసీ లోకల్​ లీడర్​ సహా 20 మంది అరెస్ట్​

టీఎంసీ లోకల్​ లీడర్​ సహా 20 మంది అరెస్ట్​
  • బీర్భూమ్ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్​హెచ్​ఆర్సీ
  • గవర్నర్​ను తొలగించాలని అమిత్​ షాను కోరిన టీఎంసీ టీం

బీర్భూమ్: పశ్చిమబెంగాల్​లోని బీర్భూమ్​ జిల్లా బొగ్టుయ్ గ్రామంలో సజీవ దహనం ఘటనపై సంచలన విషయాలు వెలుగుచూశాయి. మహిళలు, చిన్నారులు సహా ఎనిమిది మందిని సజీవ దహనం చేయడానికి ముందు వారిని చిత్రహింసలు పెట్టినట్టు పోస్టుమార్టం రిపోర్ట్​లో వెల్లడైంది. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్​ నిఫుణులు పరిశీలించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. సజీవ దహనానికి ముందు బాధితులపై దాడులు జరిగాయని, ఆ తర్వాతే వారిని ఇంట్లో బంధించి తగులబెట్టినట్టుగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని రాంపూర్​హట్​ ఆస్పత్రి అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్​ సీఎం మమత ఆదేశంతో గంటల వ్యవధిలోనే స్థానిక టీఎంసీ లీడర్ అనరుల్​ షేక్​ను ​కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ఘటన జరిగిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, ఇతర ఉద్యోగులపై వేటు వేశారు. కాగా, బీర్భూమ్​ ఘటనపై నేషనల్​ హ్యూమన్​ రైట్స్​ కమిషన్(ఎన్​హెచ్​ఆర్సీ) సుమోటో కేసు నమోదు చేసింది. బెంగాల్​ వెళ్లి ఎన్​హెచ్​ఆర్సీ బృందం విచారణ జరపనుంది. ఈ ఘటనకు సంబంధించి తృణముల్​ కాంగ్రెస్​ నాయకుల బృందం పార్లమెంట్​లో కేంద్ర హోం మంత్రి అమిత్​షాను కలిసింది. బెంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​ను తొలగించాలని ఆయనకు విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా గవర్నర్​ నడుచుకుంటున్నారని, ఆయనను వెంటనే తొలగించాలని కోరింది. అయితే ఈ ఘటనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని, బెంగాల్​ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ డిమాండ్​ చేసింది.

ఎవరీ అనరుల్ ​షేక్?

మమత ఆదేశాల మేరకు టీఎంసీ లీడర్​ అనరుల్​ షేక్​ను బెంగాల్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. బీర్భూమ్​ ఘటన జరిగిన నాటి నుంచి టీఎంసీ బ్లాక్​ ప్రెసిడెంట్​గా​ ఉన్న అనరుల్​ షేక్​ పేరు మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనలో అతని ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడిని వెంటనే అరెస్ట్​ చేయాలని బాధిత కుటుంబాలు కూడా డిమాండ్​ చేస్తున్నాయి. సీఎం మమత ఎదుట కూడా బాధితులు అనరుల్​ షేక్​ పేరును ప్రస్తావించి.. చర్యలు తీసుకోవాలని కోరారు. రాంపూర్​హట్​కు చెందిన అనరుల్​ షేక్.. టీఎంసీ ఏర్పాటు నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. బీర్భూమ్​ ఎమ్మెల్యే, బెంగాల్​ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​ ఆశిష్​ బెనర్జీకి ఇతను కీలక అనుచరుడు. టీఎంసీ బ్లాక్​ ప్రెసిడెంట్​ కావడంతో బొగ్టుయ్  గ్రామంలో రాజకీయ పరిణామాలను ఇతడే కంట్రోల్​ 
చేస్తుంటాడు.

బీర్భూమ్​ ఘటన వెనుక పెద్ద కుట్ర: మమత

బీర్భూమ్​ సజీవ దహనం ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు. గురువారం బాధిత కుటుంబాలను 
ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. వారికి నష్టపరిహారం చెక్కులను అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, లొంగిపోకపోతే వారి అంతుచూస్తామని హెచ్చరించారు. ‘‘ఇలాంటి దారుణ ఘటన ఆధునిక బెంగాల్​లో జరుగుతుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. చిన్నారులను, మహిళలను దారుణంగా చంపేశారు. మీ కుటుంబ సభ్యులు చనిపోతే.. నా గుండె ముక్కలైపోయింది”అంటూ బాధితులను ఓదార్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. సీనియర్​ పోలీస్ అధికారిని పిలిపించుకున్న మమత.. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనతో సంబంధం ఉందని ఆరోపణలు వినిపిస్తున్న టీఎంసీ లీడర్​ అనరుల్​ షేక్​ను అరెస్ట్​ చేయాలని మమత ఆదేశించారు.