
- ప్రతిపక్ష ఆర్జేడీ అభ్యంతరం
- రాజకీయ కుట్ర అంటూ బీజేపీపై ఫైర్
పాట్నా: బిహార్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఒకటి లేదా రెండు దశల్లోనే నిర్వహించాలని ఎన్నికల సంఘానికి బీజేపీ విజ్ఞప్తి చేసింది. పోలింగ్ బూత్ లకు బురఖా వేసుకుని వచ్చే మహిళల గుర్తింపును కూడా వెరిఫై చేయాలని కోరింది. పోలింగ్ బూత్ లలో ఆ మహిళల ఓటరు ఐడీ ఫొటోగ్రాఫ్ లను పరిశీలించాలని బిహార్ బీజేపీ అధ్యక్షుడు దిలిప్ జైస్వాల్.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని బృందానికి రిక్వెస్ట్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు రాష్ట్రంలో ఈసీ రెండు రోజుల పాటు పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ప్రధాన పార్టీల నేతలతో ఈసీ అధికారులు శనివారం భేటీ అయ్యారు. బీజేపీ తరపున స్టేట్ ప్రెసిడెంట్ దిలిప్ జైస్వాల్, ఆర్జేడీ తరపున అభయ్ కుశ్వాహా, ఆ పార్టీ ప్రతినిధులు చిత్తరంజన్ గగన్, ముకుంద్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జైస్వాల్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలను రెండు దశల్లోనే ముగించాలన్నారు. ఎన్నికల ప్రక్రియను జాప్యం చేయరాదని కోరారు.
బుర్కా వేసుకున్న మహిళల గుర్తింపును వెరిఫై చేయాలన్న బీజేపీ విజ్ఞప్తికిపై ఆర్జేడీ అభ్యంతరం తెలిపింది. బీజేపీ రాజకీయ కుట్రకు పాల్పడుతున్నదని ఆ పార్టీ నేత అభయ్ కుశ్వాహా మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) నిర్వహించారని, కొత్తగా ముస్లిం మహిళల గుర్తింపును వెరిఫై చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
ఫ్రెష్ ఫొటోగ్రాఫ్ లతో ఓటర్లందరికీ ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. కాగా, ఎన్నికలను రెండు దశల్లోనే ముగించాలన్న బీజేపీ ప్రతిపాదనకు ఆర్జేడీతో పాటు మిగతా పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. ఎన్నికల నిర్వహణకు రెండు నెలల కన్నా ఎక్కువ సమయం తీసుకోరాదని, ఛట్ పండుగ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఆర్జేడీ తరపున అభయ్ కుశ్వాహా కోరారు.