పంటలు ఎండుతున్నా పట్టించుకుంటలేరు

పంటలు ఎండుతున్నా పట్టించుకుంటలేరు

యాదగిరిగుట్ట, వెలుగు : రైతులు ఆరుగాలం కష్టపడి వేసిన పంటలు ఎండిపోతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ ఆరోపించారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం, మాసాయిపేట, మల్లాపురం గ్రామాల్లో ఎండిపోయిన వరి పంట పొలాలను గురువారం బీజేపీ, కిసాన్ మోర్చా నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అశోక్​గౌడ్ మాట్లాడుతూ బావులు, బోర్లలో నీళ్లు అడుగంటిపోయి చేతికొచ్చిన వరి పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. 

నీళ్లు లేక ఎండిపోయిన వరి పంటను పశువులు మేస్తుంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. పంటలు ఎండిపోయిన రైతులను ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. వారి వెంట బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పక్కీరు రాజేందర్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షురాలు గుంటుపల్లి మహేశ్వరి, జిల్లా కార్యదర్శి అచ్చయ్య, పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ చంద్రమౌళి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గుండా నరసింహులు తదితరులు ఉన్నారు.