తెలంగాణలో 9 సీట్లకు బీజేపీ అభ్యర్థులు ఖరారు

తెలంగాణలో 9 సీట్లకు బీజేపీ అభ్యర్థులు ఖరారు
  • సికింద్రాబాద్ - నుంచి కిషన్ రెడ్డి,  కరీంనగర్- నుంచి సంజయ్
  • అర్వింద్​కు నిజామాబాద్, ఈటలకు మల్కాజ్ గిరి
  • కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చేవెళ్ల, బూర నర్సయ్యకు భువనగిరి
  • -భరత్​కు నాగర్ కర్నూల్, బీబీ పాటిల్​కు జహీరాబాద్ టికెట్
  • హైదరాబాద్- నుంచి బరిలోకి మాధవీలత
  • మళ్లీ వారణాసి నుంచే ప్రధాని మోదీ పోటీ

న్యూఢిల్లీ, వెలుగు: రాబోయే లోక్​సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. మొత్తం 18 రాష్ట్రాలు / యూటీలకు చెందిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. శనివారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ వినోద్  తావ్డే అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అందులో తెలంగాణ నుంచి 9 సీట్లకు క్యాండిడేట్లను ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్  నుంచి మాధవీలత, కరీంనగర్  నుంచి బండి సంజయ్, నిజామాబాద్  నుంచి ధర్మపురి అర్వింద్, మల్కాజ్ గిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్  నుంచి పోతుగంటి భరత్, జహీరాబాద్  నుంచి బీబీ పాటిల్ పోటీ చేయనున్నారు.

ఈ సందర్భంగా వినోద్  తావ్డే మాట్లాడుతూ.. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తమ పార్టీకి సొంతంగా 370 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాతిపదికన ఫస్ట్ లిస్ట్​లో మొత్తం 195 మంది అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. ఈ జాబితాలో మహిళలకు 28 సీట్లు, యువకులకు 47, ఎస్సీలకు 27,  ఎస్టీలకు18 స్థానాల్లో అవకాశం కల్పించామని చెప్పారు. 

మోదీ మూడోసారి వారణాసి నుంచే..!

యూపీలోని వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి బరిలోకి దిగుతున్నారు. అలాగే గుజరాత్ లోని గాంధీ నగర్  నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వరుసగా రెండోసారి పోటీ చేయనున్నారు. ‘‘కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, గజేంద్ర సింగ్ షెకావత్, రాజీవ్ చంద్ర శేఖర్, మన్ సుఖ్ మాండవీయ, సాధ్వీ నిరంజన్  జ్యోతి, నిషికాంత్  దూబే, అర్జున్  ముండా, కిరణ్  రిజిజు, మనోజ్  తివారీ, పురుషోత్తం రూపాలా, జితేంద్ర సింగ్,  జ్యోతిరాదిత్య సింధియా, పలువురు కేంద్ర మంత్రులకు ఫస్ట్  లిస్టులో చోటు కల్పించాం. విధిష నుంచి మధ్యప్రదేశ్  మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, దిబ్రూగఢ్  నుంచి అస్సాం మాజీ సీఎం శర్బానంద సోనోవాల్ కు అవకాశం ఇచ్చాం. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని పక్కన పెట్టి దివంగత సుష్మాస్వరాజ్  కూతురు బన్సూరి స్వరాజ్ కు చాన్స్  ఇచ్చాం. సినీ నటుల్లో హేమామాలిని మరోసారి మథుర నుంచి బరిలో నిలవనున్నారు. కేరళలోని త్రిసూర్   నుంచి నటుడు సరేష్​ గోపీకి సీటు కేటాయించాం”  అని వినోద్  తావ్డే వివరించారు. 

రాష్ట్రంలో ముగ్గురు సిట్టింగ్​లకు

2019లో తెలంగాణ నుంచి మొత్తం నలుగురు గెలువగా తాజాగా ప్రకటించిన తొలి జాబితాలో ముగ్గురు సిట్టింగ్ లకు మళ్లీ అవకాశం కల్పించారు. ఇందులో సికింద్రాబాద్  నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్  నుంచి బండి సంజయ్, నిజామాబాద్  నుంచి ధర్మపురి అర్వింద్  పేర్లు ఉన్నాయి. రాష్ట్రంలోని సిట్టింగ్​ స్థానాల్లో ఆదిలాబాద్​ను పెండింగ్​లో పెట్టారు. ఈ స్థానంలో 2019లో సోయం బాపూరావు విజయం సాధించారు. ఫస్ట్​ లిస్టులో రాష్ట్రం నుంచి చోటు దక్కించుకున్న తొమ్మిది మంది అభ్యర్థుల్లో ఇటీవల బీఆర్​ఎస్​కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్​ ఉన్నారు. అదేవిధంగా బీఆర్​ఎస్​కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన నాగర్​కర్నూల్​ ఎంపీ రాములుకు బదులుగా ఆయన కుమారుడు భరత్​కు నాగర్​ కర్నూల్​ సీటు దక్కింది.

మహబూబ్​నగర్​పై సస్పెన్స్

మొదటి జాబితాలోనే మహబూబ్ నగర్  అభ్యర్థిగా తమ పేరు ఉంటుందని ఆశించిన ఆశావహులకు హైకమాండ్  సస్పెన్స్ నే మిగిలించింది. ఈ సీటు కోసం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ నేషనల్  ఎగ్జిక్యూటివ్  మెంబర్  జితేందర్ రెడ్డి  పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జాతీయ ఉపాధ్యక్షురాలిగా అన్ని కమిటీల్లో ఉన్న అరుణ.. అవకాశం దొరికినప్పుడల్లా తన అభ్యర్థిత్వాన్ని బలపరుచుకుంటూ వస్తున్నారు. మరోవైపు పార్టీలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని ఆ సీటు తనకే కేటాయించాలని జితేందర్  రెడ్డి అగ్రనేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో కోర్  గ్రూప్  మీటింగ్ లో కిషన్ రెడ్డి మహబూబ్ నగర్  పేరు చెప్పగానే... అమిత్ షా జోక్యం చేసుకొని ఆ నేతలిద్దరి పేర్లు రాసుకోవాలని ఆదేశించారు. ఇందులో ఒకరి పేరు బీజేపీ సెంట్రల్  ఎలక్షన్ కమిటీలో ఫైనల్ అవుతుందని అందరూ భావించారు. కానీ, ఈ సీటుపై హైకమాండ్  ఎటూ  తేల్చలేకపోయింది. తాజాగా రాష్ట్రంలోని 17 సీట్లలో 9 స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాగా... మిగిలిన 8 సీట్లకు సెకండ్  లిస్ట్ లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 

యూపీ నుంచి అత్యధికంగా 51 మంది

అత్యధికంగా ఉత్తర ప్రదేశ్  నుంచి 51 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పశ్చిమ  బెంగాల్  నుంచి 20, మధ్య ప్రదేశ్  24, గుజరాత్  15, రాజస్థాన్ 15, కేరళ 12,  ఝార్ఖండ్ 11,  అస్సాం 11, చత్తీస్ గఢ్  11, తెలంగాణ 9, ఢిల్లీ 5, ఉత్తరాఖండ్ 3, జమ్మూకాశ్మీర్ 2, అరుణాచల్ ప్రదేశ్  2, అండమాన్ 1, దాద్రానగర్  హవేలి1, గోవా 1, త్రిపుర నుంచి 1 సీటుకు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.

బీబీ పాటిల్‌‌‌‌‌‌‌‌కు టికెట్ ఎట్లిస్తరు?

    బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్​రెడ్డిని అడ్డుకొని కార్యకర్తల ఆందోళన

సంగారెడ్డి, వెలుగు: బీజేపీ నుంచి జహీరాబాద్ ఎంపీ టికెట్ బీబీ పాటిల్‌‌‌‌‌‌‌‌కు ఇవ్వొద్దంటూ ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో కేంద్ర మంత్రి, పార్టీ చీఫ్​ కిషన్ రెడ్డిని అడ్డుకుని నిరసన తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ ఆఫీసుకు చేరుకొని ఆందోళనలు చేశారు. ఫెయిల్యూర్ ఎంపీ బీబీ పాటిల్‌‌‌‌‌‌‌‌కు టికెట్ ఇవ్వొద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. ఇంతకాలం పార్టీ కోసం పని చేసిన వారిని కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒక్క రోజులో టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రెండుసార్లు జహీరాబాద్ ఎంపీగా గెలిచిన పాటిల్.. ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. మాజీ ఎంపీ స్వర్గీయ బాగారెడ్డి కుమారుడు జయపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని.. ఆయనకు టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీ ఆఫీసుకు వచ్చిన కిషన్ రెడ్డిని అడ్డుకొని, బీబీ పాటిల్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చిన టికెట్‌‌‌‌‌‌‌‌ను క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల మనోభావాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని కిషన్ రెడ్డి వారికి నచ్చజెప్పారు.