తెలంగాణలో అవినీతి తాండవం : బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌పై బీజేపీ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌

తెలంగాణలో అవినీతి తాండవం : బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌పై బీజేపీ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు : 2014లో కేసీఆర్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తున్నదని బీజేపీ ఆరోపించింది. ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు అం దరూ ఏదో ఒక రకమైన అవినీతికి పాల్పడుతున్నారని మండిపడింది. ఇసుక, గ్రానైట్, ల్యాండ్, డ్రగ్స్‌‌‌‌, లిక్కర్, కాంట్రాక్ట్ మాఫియాలతో బీఆర్ఎస్ నాయకులకు సంబంధాలు ఉన్నాయని విమర్శించింది. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందిస్తామంటూ చెప్పుకొచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కంపే కనిపిస్తున్నదని దుయ్యబట్టింది. ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని, ఏ ఒక్కటీ సరిగ్గా నెరవేర్చలేదని ధ్వజమెత్తింది. 154 అంశాలపై 32 పేజీలతో బీజేపీ రూపొందించిన ‘అవినీతి, నియంతృత్వ బీఆర్ఎస్ కుటుంబ పాలనపై తెలంగాణ ప్రజా కోర్టులో చార్జ్‌‌‌‌షీట్’ను సోమవారం కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రిలీజ్ చేశారు. 

బీజేపీ మీడియా సెంటర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చార్జ్‌‌‌‌షీట్ కమిటీ చైర్మన్ మురళీధర్ రావు, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ ప్రకాశ్ జవదేకర్, సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మజ్లిస్ ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు పని చేస్తున్నారు. పోలీసుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండేది. కానీ ఇప్పుడు పోలీసు వ్యవస్థను పూర్తిగా రాజకీయం చేశారు. ఏమైనా అంటే బదిలీలు చేస్తామని బెదిరిస్తున్నారు” అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. ఇలాంటి సర్కార్ దేశంలో ఎక్కడా లేదని, కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కు ప్రాజెక్టును అమ్ముకుందని ఆరోపించారు. 

అవినీతికి తెలంగాణ ప్రభుత్వం అసలైన ఉదాహరణ అని మురళీధర్ రావు ఎద్దేవా చేశారు. ‘‘అవినీతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం నడవడం లేదు. పిల్లర్లు కుంగిపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయట పడింది. ఎన్నికలకు ముందు భగవంతుడే అవినీతిని బయటపెట్టిండని అనిపిస్తున్నది” అని చెప్పారు.

హామీలన్నీ ఏమైనయ్?

సర్కారు అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయే దుస్థితి తలెత్తిందని చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌లో బీజేపీ ఆరోపించింది. ‘‘స్వయంగా సీఎం కేసీఆర్ కూతురుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌‌‌తో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు చెప్పాయి. ధరణి పోర్టల్ బీఆర్ఎస్ నాయకులకు పెద్ద ఆదాయ వనరుగా మారింది. భూములను కబ్జాలు చేస్తున్నరు. ప్రత్యేక తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి దళితుడేనన్న కేసీఆర్ మాట తప్పారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. పోడు ప్రాంతాల్లో కుర్చీ వేసుకుని అక్కడికక్కడే సమస్య పరిష్కరిస్తామని చెప్పి.. ఇంతవరకు పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వలేదు. ఉద్యోగులకు ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వడం లేదు. డీఏలు టైంకు ఇవ్వడం లేదు. పీఆర్సీ ఇవ్వడం లేదు. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని తెరవలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మరిచారు” అని పేర్కొంది.