సీఎం కేసీఆర్​కు  బండి సంజయ్ హెచ్చరిక

సీఎం కేసీఆర్​కు  బండి సంజయ్ హెచ్చరిక
  • సీఎం కేసీఆర్​కు బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ హెచ్చరిక
  • చేతకాదంటే తామే నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తామని కామెంట్

హైదరాబాద్ : సుప్రీం కోర్టు ఉత్తర్వుల పేరుతో హైదరాబాద్ లో గణేజ్ నిమజ్జనాన్ని అడ్డుకోవాలని చూస్తే ట్యాంక్ బండ్ లో కాదు.. ప్రగతి భవన్ లోనే జరుగుతుందని సీఎం కేసీఆర్ ను బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ హెచ్చరించారు. సోమవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ప్రతి యేటా వినాయక నిమజ్జనం ఉత్కంఠ వాతావరణంలో జరుపుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో హిందువులకు ఏర్పడిందని ఆరోపించారు. హైదరాబాద్ లో నిమజ్జనం చేయాలంటే మండప నిర్వాహకులు అనేక పర్మిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించిందని మండిపడ్డారు. రానురాను మండపాల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

హిందువుల పండుగ అనగానే పీస్ కమిటీ మీటింగ్ లు పెడుతారని సంజయ్ విమర్శించారు. మరో మూడు రోజుల్లో నిమజ్జనం ఉందని, ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులను  పట్టించుకోని వ్యక్తి సీఎస్ సోమేశ్ కుమార్ అని, అలాంటి అధికారి ఇప్పుడు సుప్రీం కోర్టు ఉత్తర్వులను చూపడం ఏమిటని ప్రశ్నించారు. కరోనా టైమ్ లో రంజాన్ పండుగను పాతబస్తీ లో నిర్వహించారని, తాము ఎక్కడా దానికి అడ్డు చెప్పలేదని, కానీ ఈ ప్రభుత్వం రూల్స్​పేరుతో హిందువుల పండగలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. దీన్ని హిందూ సమాజం గమనించాలని కోరారు. ఒక వర్గం ఓట్లు పొందడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘నిమజ్జనం ఏర్పాట్లు చేయటం సీఎంకు చేతకాదని చెప్పమనండి.. మేమే చేసుకుంటం. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీకి హిందూ సమాజం అండగా ఉంటుంది” అని స్పష్టం చేశారు. ప్రజలకు అనుకూలంగా పాండ్స్​ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్.. ఆయన కుటుంబం సంస్కారహీనులని మండిపడ్డారు.