సీఎం అభ్యర్థుల్ని ప్రకటించని బీజేపీ, కాంగ్రెస్​.. కారణాలివే...

సీఎం అభ్యర్థుల్ని ప్రకటించని బీజేపీ, కాంగ్రెస్​.. కారణాలివే...

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తనున్న  వేళ ప్రధాన పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్​, జేడీఎస్​ ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్నాయి.  చాలా ప్రాంతాల్లో ప్రధానంగా కాంగ్రెస్​, బీజేపీ మధ్యే పోటీ ఉండనుంది. ఈ క్రమంలో ఆ పార్టీలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంలో స్పష్టతనివ్వలేదు. దీనికి కారణాలు లేకపోలేదు. 


గ్రూపు రాజకీయాలను తగ్గించాలనే ఎత్తుగడ..


ప్రధాన పార్టీలు తమ సీఎం అభ్యర్థిపై స్పష్టంగా చెప్పకపోయినా.. జేడీఎస్​ కుమారస్వామి  తమ సీఎం అభ్యర్థి అని స్పష్టం చేసింది.  జేడీఎస్​ సొంతంగా అధికారంలోకి రానప్పటికీ కింగ్​ మేకర్​ పాత్ర పోషించే అవకాశం ఉంది.  బీజేపీ దేశవ్యాప్తంగా జరిగిన చాలా ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ని ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేసింది. కాగా బీజేపీ సీనియర్​ నాయకుడు యడ్యూరప్ప సీఎం అభ్యర్థిగా లేకుండానే ప్రచారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం బసవరాజ్​ బొమ్మై ప్రచార కమిటీ అధిపతిగా ఉన్నా అధికారికంగా ఆయనే  సీఎం అభ్యర్థి అని పార్టీ ఎక్కడా ప్రకటించలేదు.  కులాలే ప్రధాన పాత్ర పోషించే కర్ణాటకలో సీఎం అభ్యర్థి విషయంలో స్పష్టతనివ్వాలని ఆయా కుల సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. రాష్ట్రంలో క్రియా శీలకంగా ఉన్న  లింగాయత్​ల ఓట్లను నిలుపుకోవాలంటే సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించాలని సీనియర్​ నేతలు సూచిస్తున్నారు. ఇటీవల ఈ సామాజికవర్గానికి చెందిన కొందరు సీనియర్​నేతలు పార్టీని వీడిన తర్వాత ఈ డిమాండ్​ బలంగా వినిపిస్తోంది. లింగాయత్​లు కాకుండా ఇతర కులాల్లో బీజేపీ ఉనికిని విస్తరించాలని కోరుకునేవారు, పార్టీ సీఎం అభ్యర్థిగా లింగాయత్​యేతర ముఖాన్ని కోరుకుంటున్నారు. 


ఐక్యంగా పోరాడతాం అంటున్న కాంగ్రెస్​


గ్రూపు రాజకీయాలు అధికంగా ఉండే కాంగ్రెస్​ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది స్పష్టతనివ్వలేదు. గెలిస్తే తాము ముఖ్యమంత్రులు కావాలని ఆశిస్తున్నామని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​, మాజీ సీఎం, సీనియర్​ నేత సిద్దరామయ్య స్పష్టం చేశారు. పార్టీ కోసం ఐక్యంగా పని చేయకపోతే, అది ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఇద్దరూ గ్రహించారు. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ కోలార్​ ప్రసంగంలో, ఎన్నికల్లో గెలవడమే అందరి ప్రప్రథమ కర్తవ్యమని, మిగిలిన అన్ని సమస్యలు తరువాత పరిష్కరించుకోవాలని నేతలకు హితబోధ చేశారు. 
కాగా ఎన్నికల పార్టీ అభ్యర్థుల ఎంపిక చివరి రౌండ్​లో, సిద్దరామయ్య, శివకుమార్​ మద్దతుదారుల మధ్య గొడవ జరిగింది. టికెట్ల పంపిణీలో ఇరువర్గాలు సద్దుమణిగినట్టు సమాచారం. అయినా గ్రాండ్​ ఓల్డ్​ పార్టీలో తిరుగుబాటు కార్యకలాపాల ప్రభావాన్ని తోసిపుచ్చలేం. అలాగే  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి కావడానికి డీకే శివకుమార్​ మద్దతు ఇవ్వడంతో రాజకీయాల్లో అలజడి రేగింది.
ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న రెండు జాతీయ పార్టీల్లో చివరికి విజయం ఎవరిని వరిస్తుందో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో మరి కొంత కాలం ఆగితే తెలుస్తుంది.