
వెలుగు నెట్ వర్క్: రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆయా చోట్ల పార్టీ జిల్లా ప్రెసిడెంట్లు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు. రైతుబంధు, బీమా అమలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. రైతుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అనేక పథకాలను అమలు చేయడం లేదని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. గత ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన హామీ మేరకు రూ. లక్ష రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తాను కౌన్సిలర్ గా కూడా గెలవలేనని అంటున్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎంపీకి బీజేపీ తడాఖా ఏంటో చూపిస్తానన్నారు.
ప్రతిరోజూ కేటీఆర్ అకౌంట్లో రూ.10 కోట్లు పడుతయ్ : ఆచారి
ధరణితో సర్కారు దోచుకుంటోందని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి విమర్శించారు. రంగారెడ్డి జిల్లాల్లో 18 వేల ఎకరాలను బ్లాక్ చేశారని, దీంతో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు రూ.పది కోట్లు కేటీఆర్ అకౌంట్లో పడతాయని ఆరోపించారు. మంగళవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ తహసీల్దార్, ఆర్డీఓలకు బదులు కలెక్టర్లకు ధరణి బాధ్యతలు అప్పగించడంతో రైతులకు ఇబ్బందులు పెరిగాయన్నారు.