ఇయాళ్టి నుంచి బీజేపీ ఇంటింటి ప్రచారానికి ఏర్పాట్లు

ఇయాళ్టి నుంచి బీజేపీ ఇంటింటి ప్రచారానికి ఏర్పాట్లు
  • గడపగడపకూ కమలం గుర్తును తీసుకెళ్లే ఆలోచనలో బీజేపీ

నల్గొండ, వెలుగు: కమలం పువ్వు గుర్తును ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నేటి నుంచి ఇంటింటి ప్రచారానికి రెడీ అవుతోంది. సోమవారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన బూత్ ఇన్​చార్జిల మీటింగ్​లో పలు అంశాలు చర్చకు వచ్చాయి. మునుగోడు నియోజకవర్గంలో తాజా పరిస్థితులు బీజేపీకి పూర్తి అనుకూలంగా ఉన్నాయని, ముఖ్యంగా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పేరు గ్రామస్థాయిలో బలంగా వినిపిస్తోందని ఇన్​చార్జిలు వివరించారు. కానీ అభ్యర్థికి దీటుగా బీజేపీ కమలం గుర్తును ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పోలింగ్ టైం దగ్గరపడ్తున్నందున 157 గ్రామాల్లో ఇల్లిల్లూ తిరుగుతూ కమలం గుర్తుపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. 

మారనున్న ప్రచార సరళి..
బూత్​ ఇన్​చార్జిల మీటింగ్​ తర్వాత బీజేపీ ఎన్నికల ప్రచార సరళి పూర్తిగా మారనున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు బూత్ ఇన్​చార్జిలు ఇంటింటి ప్రచారంలో భాగంగా బ్రోచర్లు పంపిణీ చేస్తున్నారు. బుధవారం నుంచి కమలం గుర్తుపై ఫోకస్​ పెట్టనున్నారు. నిజానికి రాజీనామా తర్వాత రాజగోపాల్ రెడ్డి పేరు ఊరూరా బలంగా వినిపిస్తున్నప్పటికీ బ్రదర్స్ ఇద్దరూ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం, వెంకట్​రెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్​లోనే ఉండడంతో కొంతమంది, ముఖ్యంగా వృద్ధులు రాజగోపాల్​రెడ్డి సైతం కాంగ్రెస్​ పార్టీలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. యువకులు, అర్బన్ ఏరియాల్లో కమలం గుర్తు పైన పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉన్నప్పటికీ రూరల్ ప్రాంతాల్లోనే ఈ సమస్య ఎదురవుతోంది. దీని వల్ల ఎన్నికల్లో నష్టం జరిగే ప్రమాదం ఉండడంతో ప్రచార శైలిని మార్చాలని నిర్ణయించారు. నేటి నుంచి ఇంటింటి ప్రచారంలో భాగంగా అభ్యర్థి పేరుతోపాటు కమలం గుర్తు గురించి ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కమలం సింబల్ కనిపించేలా పెద్ద పెద్ద బ్రోచర్లు, స్టిక్కర్లు పంపిణీ చేయనున్నారు. కమలం గుర్తు ఉన్న ప్లకార్డులనూ ప్రదర్శిస్తూ ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్లు పార్టీ సీనియర్​ లీడర్​ ఒకరు చెప్పారు.