బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్

లోక్సభ  ఎన్నికల వేళ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది.  వికాసిత్ భారత్ పేరుతో  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం మేనిఫెస్టో రిలీజ్ చేసింది. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల బృందం ఈ మేనిఫెస్టోను రూపొందించింది.  ఈ  మేనిఫెస్టో కోసం బీజేపీ  15 లక్షల సలహాలు, సూచనలు తీసుకుంది.   మోదీ గ్యారంటీ, 2047 వికసిత్ భారత్ థీమ్‌తో మేనిఫెస్టోను రూపొందించారు.  దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా మేనిఫెస్టోను రూపొందించినట్లు  పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మా మాటల్లో, చేతల్లో తేడా ఉండదన్నారు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్.  గత మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను పూర్తిచేశామన్నారు. ఈ విశ్వసనీయతనే మా బలమని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ కలని నిజం చేసి చూపించామన్నారు. మోదీ గ్యారెంటీ అనేది 24 క్యారెట్ల బంగారం లాంటిదని చెప్పుకొచ్చారు రాజ్ నాథ్ సింగ్.  అంబేద్కర్ బాటలోనే బీజేపీ పయనిస్తోందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.  మోదీ  నేతృత్వంలో దేశంలో అభివృద్ధి పథంలో పయనిస్తోందని చెప్పారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.