- సీఎం రేవంత్‌కు లంకెబిందెలు దొరికినయ్..
- ఇది రూ.6.29 లక్షల కోట్ల స్కామ్: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ (హిల్ట్) పాలసీ రూపంలో లంకెబిందెలు దొరికాయని, అభివృద్ధి పేరు చెప్పి సర్కారు భూములను కొల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇది హిల్ట్ పాలసీ కాదు.. ముమ్మాటికీ ల్యాండ్ లూటీ చేసే పాలసీ అన్నారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న 22 పారిశ్రామిక వాడల్లోని 9,292 ఎకరాల భూములను ‘మల్టీ యూజ్ జోన్లు’గా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో -నం:27 వెనుక భారీ కుంభకోణం దాగి ఉందన్నారు. ఈ 22 పారిశ్రామిక వాడల్లోని భూముల మార్కెట్ ధర గజానికి సుమారు రూ.2 లక్షల వరకు పలుకుతుందని తెలిపారు.
రోడ్లు, మౌలిక వసతులకు 30 శాతం భూమిని పక్కనపెట్టినా.. మిగిలిన 6,510 ఎకరాలను గజాల లెక్కన అమ్మితే ప్రభుత్వానికి దాదాపు రూ.6 లక్షల 29 వేల కోట్ల ఆదాయం వచ్చేదని వెల్లడించారు. అయితే రూ.6.29 లక్షల కోట్ల స్కామ్‌లో సగం వాటా రూ.3.50 లక్షల కోట్లు సీఎం రేవంత్ రెడ్డికి, 15 మంది మంత్రులకు తలా రూ.10 వేల కోట్ల చొప్పున రూ.1.50 లక్షల కోట్లు వెళ్తున్నాయని ఆరోపించారు. మిగిలిన రూ.లక్ష కోట్లు ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు ముట్టజెప్పేందుకే ఈ దందాకు తెరలేపారని చెప్పారు. లక్షల కోట్ల విలువైన ఇంత పెద్ద పాలసీపై ఈ నెల 17న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో చర్చ కూడా జరగలేదన్నారు.
