మమతపై పోటీకి లాయర్ ప్రియాంక

మమతపై పోటీకి లాయర్ ప్రియాంక

కలకత్తా: బెంగాల్ అసెంబ్లీ ఉపఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో లాయర్ ప్రియాంక టిబ్రివాల్‎ను బీజేపీ బరిలోకి దించింది. ప్రియాంక వృత్తిరిత్యా లాయర్. ఆమె సుప్రీంకోర్టులోనూ మరియు కలకత్తా హైకోర్టులోనూ లాయర్ ప్రాక్టీస్ చేసింది. ప్రియంక కలకత్తాలో జన్మించి.. స్కూలింగ్ అంతా అక్కడే చేసింది. ఆ తర్వాత ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి.. తిరిగి కలకత్తాకు వచ్చి హజ్రా కాలేజీ నుంచి తన ‘లా’ను పూర్తిచేసింది. ప్రియాంక 2014లో బీజేపీలో చేరి.. ప్రస్తుతం బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్‎గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ప్రియాంక 2021లో జరిగిన ఎన్నికల్లో ఎంటల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసింది. ఆ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి స్వర్ణ కమల్ సాహా చేతిలో ఓడిపోయింది. గతంలో 2015 మున్సిపల్ ఎన్నికల్లోనూ పోటీచేసి టీఎంసీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలైంది. ప్రియాంక ప్రస్తుతం 2021 ఎన్నికల సందర్భంగా బెంగాల్‎లో జరిగిన ఘర్షణల కేసును వాదిస్తోంది.

ప్రియాంకతో పాటు మరికొంతమంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. జంగీపూర్ నుంచి సుజిత్ దాస్, శంశేర్ గంజ్ నుంచి మిలన్ ఘోష్‎లను బరిలోకి దింపుతోంది. ఈ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు కానుంది.