సెంథిల్ వ్యాఖ్యలపై అట్టుడికిన పార్లమెంట్.. క్షమాపణలు చెప్పిన డీఎంకే ఎంపీ

సెంథిల్ వ్యాఖ్యలపై అట్టుడికిన పార్లమెంట్.. క్షమాపణలు చెప్పిన డీఎంకే ఎంపీ

ఢిల్లీ: నిన్న పార్లమెంటులో డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ లోక్ సభలో దుమారం రేగింది. సెంథిల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్‌, ఆ పార్టీ సీనియర్‌ నేతలు సోనియా, రాహుల్‌ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించింది. ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి బదులు భారతీయ సంస్కృతిని, గుర్తింపును సెంథిల్ అవమానించారని ఆరోపించింది.

ఇదే వివాదంపై  కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ‘వసుదైక కుటుంబం’ అనే సందేశాన్ని ఇస్తుంటే.. ప్రతిపక్షం మాత్రం అసభ్యకరమైన భాషను ఉపయోగించడం, ఈవీఎంలను నిందించడం, మూడు రాష్ట్రాల్లో ఓటమికి ప్రాంతీయతను కారణంగా చూపే పనిలో పడిందని ఫైర్ అయ్యారు. దేశాన్ని ఉత్తర-దక్షిణాలుగా విభజించి చూసే ట్రెండ్‌ అమేథీలో 2019లో రాహుల్‌ గాంధీ ఓటమి చెందినప్పటి నుంచే మొదలయ్యిందని దుయ్యబట్టారు.

ఎంపీ క్షమాపణలు..

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించగా..  తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌ గెలుపొందింది. ఈ నేపథ్యంలో హిందీ రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలుగా అభివర్ణిస్తూ అక్కడ మాత్రమే కాషాయ దళం గెలువగలదని డీఎంకే ఎంపీ సెంథిల్‌ కుమార్‌  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై పలు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై సెంథిల్‌ కుమార్‌ స్పందించి క్షమాపణలు చెప్పారు.