ప్రజలు అల్లాడుతుంటే మీకు ప్రైవేట్​ జెట్‌‌ కావాలా?.. కర్నాటక సీఎంపై బీజేపీ ఫైర్

ప్రజలు అల్లాడుతుంటే మీకు ప్రైవేట్​  జెట్‌‌ కావాలా?.. కర్నాటక సీఎంపై బీజేపీ ఫైర్

బెంగళూరు: కర్నాటక సీఎం సిద్ధరామయ్య, మంత్రులు జమీర్ అహ్మద్ ఖాన్‌‌, కృష్ణ బైరే గౌడ  ఓ లగ్జరీ ప్రైవేటు జెట్‌‌లో ప్రయాణిస్తున్నట్లు వెలువడిన వీడియో ఒకటి వైరల్​గా మారింది. దీనిపై ప్రతిపక్షాలు  తీవ్ర విమర్శలకు దిగాయి. ఓ వైపు రాష్ట్రం కరువులో ఉంటే సీఎం సిద్ధరామయ్య, ఇతర మంత్రులు మాత్రం ఖరీదైన  ప్రైవేటు జెట్​లో ట్రావెల్ చేస్తున్నారని శుక్రవారం  బీజేపీ మండిపడింది. 

" రాష్ట్రం మొత్తం తీవ్ర కరువుతో అల్లాడుతున్నది. వర్షాలు లేక, పంటలు సరిగ్గా పండక రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం, రాష్ట్ర మంత్రులు వారి లగ్జరీ లైఫ్ స్టయిల్ చూపిస్తున్నారు. రాష్ట్రానికి కరువు నిధులు అడిగేందుకు ఢిల్లీకి లగ్జరీ విమానంలో వెళ్తారా..? పన్ను చెల్లింపుదారుల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం మంత్రులకు తేలికైపోయింది!" అని బీజేపీ కర్నాటక అధ్యక్షుడు బీవై విజయేంద్ర  విమర్శించారు.

బీజేపీవి సిల్లీ కామెంట్లు

విజయేంద్ర చేసిన ట్వీట్‌‌కు సీఎం సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు.  "ప్రధాని మోదీ ఎలా ప్రయాణిస్తారు? ఈ ప్రశ్నను బీజేపీ వాళ్లను అడగండి. వాళ్లు చాలా సిల్లీగా మాట్లాడుతున్నారు" అంటూ సీఎం మీడియాతో  చెప్పారు. ప్రధాని ఇప్పటిదాకా  లగ్జరీ విమానంలోనే 74 విదేశీ పర్యటనలు చేశారని సిద్ధరామయ్య గుర్తుచేశారు. మోదీ ఒక్కో ప్రయాణానికి సగటున రూ.8.9 కోట్లు ఖర్చు అయిందని తెలిపారు. అయితే, ఆకలి సూచికలో  దేశం 111వ స్థానంలో ఉందని.. మరి ప్రధాని అలా ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలని బీజేపీ నేతలను నిలదీశారు.