టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో జోష్

టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో జోష్

మహబూబ్​నగర్, వెలుగు:టీచర్లు ఇచ్చిన తీర్పు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ప్లస్​ పాయింట్​ అయ్యింది. ఆ పార్టీ మద్దుతుతో మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్​ టీచర్​ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన ఎ వెంకట నారాయణరెడ్డి(ఏవీఎన్​రెడ్డి) విజయం సాధించడంతో కేడర్​ ఫుల్ జోష్​లో ఉంది. పోలింగ్​కు వారం ముందు జాతీయ, రాష్ట్ర స్థాయి లీడర్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు. సమస్యల పరిష్కారంపై టీచర్లకు భరోసా ఇవ్వడం, బీఆర్ఎస్​ సర్కారుపై ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో పార్టీకి కలిసొచ్చిందని అంటున్నారు.

మూడు నెలలుగా గ్రౌండ్​ వర్క్..​

టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ హైకమాండ్​ పక్కా ప్లాన్​తో అడుగులు వేసింది. ఎలక్షన్లకు మూడు నెలల ముందు నుంచే గ్రౌండ్​వర్క్​ స్టార్ట్​ చేసింది.కార్నర్​ మీటింగులు, శక్తి కేంద్రాలు, బూత్​ స్థాయి కార్యకర్తల సమావేశాల్లో ఎప్పటికప్పుడు టీచర్ల సమస్యలను ప్రస్తావిస్తూ వచ్చింది. దీనికితోడు నిరుడు పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ జీవో 317పై టీచర్లకు సపోర్ట్​గా దీక్షలు చేయగా, పోలీసులు అరెస్ట్​ చేశారు. కొద్ది రోజుల తర్వాత ఈ జీవోపై ఉమ్మడి పాలమూరు జిల్లా టీచర్లతో సదస్సును నిర్వహించారు. జీవో వల్ల టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 10న టీచర్​ ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా ఆయన మళ్లీ పాలమూరులో పర్యటించి, టీచర్లతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ఉమ్మడి జిల్లాలో 8,153 మంది ఓటర్లు ఉంటే.. అందులో సగం మంది అటెండ్​ అయ్యారు. సమ్మేళనంలో తాము బలపర్చిన అభ్యర్థిని గెలిపిస్తే ఒకటో తారీఖునే జీతాలిస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 317ను రద్దు చేస్తామనే హామీ ఇచ్చారు. దీనికితోడు ప్రస్తుతం కొన్ని సంఘాల లీడర్లు రూలింగ్​ పార్టీకి అమ్ముడుపోయారని, వారు టీచర్ల సమస్యలపై పోరాటం చేయడం లేదనే విషయాన్ని ప్రస్తావించారు. వారిలో చాలా మంది రూలింగ్​ పార్టీ లీడర్లతో కలిసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, అందుకు సంబంధించిన చిట్టా తమ వద్ద ఉందనే విషయాలను బలంగా చెప్పారు. జీవో 317పై రాష్ట్రవ్యాప్తంగా టీచర్లు ఆందోళన చేసినా గతంలో గెలిచిన టీచర్​ ఎమ్మెల్సీలు స్పందించ లేదని, కనీసం ప్రభుత్వంతో చర్చలు జరపలేదనే అంశాన్ని గట్టిగా వినిపించారు. ఈ నెల 8న కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కూడా టీచర్లతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. టీచర్ల పట్ల రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన చర్చించారు. బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థిని గెలిపిస్తే, ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్​రెడ్డి ఎప్పటికప్పుడు ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో పర్యటించి ఏవీఎన్​కు మద్దతుగా ప్రచారం చేసి, ఆయన గెలుపులో కీ రోల్​ పోషించారు.

రానున్న ఎన్నికలపై ప్రభావం..

ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో జరిగిన మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్​ టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ సపోర్ట్​ చేసిన క్యాండిడేట్​ గెలుపొందడం, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఎఫెక్ట్​ పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, ఇసుక, మట్టి, మైనింగ్​ దందాలతో ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు గద్వాల, వనపర్తి, మక్తల్, జడ్చర్ల, అచ్చంపేట, అలంపూర్, షాద్​నగర్, నాగర్​కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోకవర్గాల్లో సొంత పార్టీలోని ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్​ చైర్మన్లు, ఇతర లీడర్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సిట్టింగ్గులు, సెకండ్​ కేడర్​ లీడర్ల మధ్య టికెట్ల లడాయి నడుస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు ఇచ్చిన తీర్పుతో ఆ పార్టీ డిఫెన్స్​లో పడింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు కూడా భిన్నంగా ఉండే చాన్స్ ఉంటుందని జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

సీరియస్​గా గ్రౌండ్​ వర్క్​​ 

ఉమ్మడి పాలమూరుపై బీజేపీ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ఏడాదిన్నర నుంచే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్​ వర్క్​ స్టార్ట్​ చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన లీడర్లు, కేడర్​తో డిస్కషన్​ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ప్రతి వారం జాతీయ, రాష్ట్ర స్థాయి లీడర్ల పర్యటనలు ఉండేలా ప్లాన్​ చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మార్చి చివరి వారం లేదా ఏప్రిల్​ నుంచి ఉమ్మడి జిల్లాలోని ప్రతి పల్లె, తండాలో ఓటర్లను కలిసేందుకు పార్టీ హైకమాండ్​ స్కెచ్  వేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ఉమ్మడి జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర చేసిన టైంలో ఆయన నోట్​ చేసుకున్న సమస్యలు, ప్రభుత్వం హామీలు విస్మరించడంపై ప్రజలకు వివరించారు.