సైన్స్​ సిటీ ఏర్పాటుకు టీఆర్​ఎస్​ సర్కారు భూమినిస్తలేదు : మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి

సైన్స్​ సిటీ ఏర్పాటుకు టీఆర్​ఎస్​ సర్కారు భూమినిస్తలేదు : మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి

మేడ్చల్ జిల్లా : ప్రజలను కాపాడాల్సిన గవర్నమెంట్ వారి సొత్తును అప్పనంగా తింటూ.. ఎంతోమంది చావులకు కారణమవుతోందని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని, రోడ్డు ప్రమాదాలలో ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి కళ్లు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షులు విక్రం రెడ్డి ఆధ్వర్యంలో గండి మైసమ్మ లోని వేదిక ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడారు. గ్రంథాలయ సెస్​ పేరుతో వసూలు చేసిన సొమ్మును జేబులో వేసుకుని కొత్త గ్రంథాలయాల ఏర్పాటును రాష్ట్ర సర్కారు మరిచిందని ఆరోపించారు. ప్రజారోగ్యం దృష్ట్యా  జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను ప్రస్తుతమున్న ప్రదేశం నుంచి తరలించాలన్నారు.

అధికార పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అక్రమ కట్టడాల పేరుతో ప్రజలను వేధిస్తున్నారని మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి అన్నారు. అధికారం చేతుల్లో ఉంది కదా అని స్థానిక ఎమ్మెల్యే కింద ఉండే మనుషులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు.  కండ్లకోయ ఐటీ టవర్ ఏర్పాటుకు హడావిడి చేసిన టీఆర్ఎస్​ ప్రభుత్వం.. శంకుస్థాపన చేసే విషయంలో శ్రద్ధ చూపడం లేదన్నారు.  25 ఎకరాల స్థలం కేటాయిస్తే సైన్స్​ సిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్తుంటే రాష్ర్ట ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పారు. ఎన్నికలు ఉన్నచోటనే రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తూ.. రాష్ట్రం మొత్తాన్ని టీఆర్ఎస్​ గాలికి వదిలేసిందని చాడా సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.