
- ఉద్ధవ్ స్పీచ్ లో అధికారం పోయిందన్న బాధ కన్పించిందని కామెంట్
పండర్‌పూర్: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే సోదరుల కలయికపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ముంబైలో జరిగిన ఒక ర్యాలీలో ఆ సోదరులు కలిసి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలోని పాఠశాలల్లో మూడో భాషగా హిందీని ప్రవేశపెట్టిన రెండు ప్రభుత్వ తీర్మానాలను ఉపసంహరించుకున్నందుకు మహారాష్ట్రలో ఠాక్రే సోదరులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
అయితే, ఈ ఐక్యతను బీజేపీ నాయకులు "జిహాదీ సమావేశం" గా అభివర్ణించారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఒక నాటకీయ ప్రయత్నమని విమర్శించింది. అలాగే, ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రసంగంపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ, ఈ ర్యాలీ మరాఠీ గుర్తింపు గురించి మాట్లాడాల్సిన వేదిక అయినప్పటికీ, ఉద్ధవ్ తన ప్రభుత్వం కూలిపోయిన విషయంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని విమర్శించారు.
"ఇది విజయోత్సవ ర్యాలీ కాదు, రుదాలీ దర్శనం" అని ఆయన వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో అంత్యక్రియల సమయంలో ఏడవడానికి నియమించుకునే వృత్తిగత మహిళలను ‘రుదాలీ’ అని పిలుస్తారు. ఉద్ధవ్ ప్రసంగం అతని రాజకీయ నిరాశను, అధికారం తిరిగి పొందాలనే కోరికను ప్రతిబింబిస్తుందని ఫడ్నవీస్ ఆరోపించారు. తన ప్రభుత్వ పాలన వల్లే వారు కలిశారని రాజ్ ఠాక్రే అనడంపై స్పందిస్తూ.. తనకు క్రెడిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అన్నారు.
బీజేపీ ముంబై అధ్యక్షుడు ఆశిష్ షెలార్ మాట్లాడుతూ.. ఈ ర్యాలీని భాష కోసం నిర్వహించిన కార్యక్రమం కంటే ఎన్నికల కోసం బుజ్జగింపు ప్రచారంగా అభివర్ణించారు.