అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. 82 సీట్లలో కమలం పార్టీ విజయఢంకా

అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. 82 సీట్లలో కమలం పార్టీ విజయఢంకా

గువాహటి: అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయ బావుటా ఎగురవేసింది. మొత్తం 126 సీట్లలో 82 చోట్ల కమలం పార్టీ విజయ ఢంకా మోగించగా.. 20 చోట్ల బీజేపీ మిత్రపక్షాలు బోడోల్యాండ్  పీపుల్స్  ఫ్రంట్ (బీపీఎఫ్), అసోం గణ పరిషత్  (ఏజీపీ) గెలుపొందాయి. దీంతో 102 సీట్లలో ఎన్డీయే విజయం సాధించింది. 

ఇక, కాంగ్రెస్  పార్టీ 19 స్థానాల్లో, ఆలిండియా యునైటెడ్  డెమొక్రటిక్  ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) 2, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ ఒక స్థానాల్లో గెలుపొందాయి. సీఎం హిమంత బిశ్వ శర్మ కేబినెట్‎లో మంత్రులు పిజూష్​ హజారికా, రనోజ్  పెగూ, అజంతా నియోగ్, అతుల్  బోరా కూడా విజేతగా నిలిచారు. జాగీరోడ్  నియోజకవర్గంలో హజారికా తన సమీప ప్రత్యర్థి బుబుల్  దాస్ (కాంగ్రెస్) పై 93,584 ఓట్ల తేడాతో గెలిచారు. 

ఈ నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఓవరాల్ గా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ధేమాజీ నియోజకవర్గంలో రనోజ్  పెగూ 32,229 ఓట్లు, బీజేపీ వెటరన్ హితేంద్రనాథ్ గోస్వామి 23,182 ఓట్లతో విజయం సాధించారు. ఆర్థిక మంత్రి అజంతా నియోగ్ తన  నియోజకవర్గం గోలాఘాట్‎లో వరుసగా ఆరోసారి గెలుపు బావుటా ఎగురవేశారు. 

తన కాంగ్రెస్  అభ్యర్థి బిటుపన్  సైకియాను 43,759 ఓట్ల తేడాతో ఓడించారు. ఏజీపీ పార్టీ అభ్యర్థి, వ్యవసాయ శాఖ మంత్రి అతుల్  బోరా 60,537 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి హరిప్రసాద్  సైకియా (రాయ్ జోర్ దళ్) పై విజయం సాధించారు. 

మరో కేబినెట్  మంత్రి, బీపీఎఫ్​ లీడర్  చరణ్​ బోరో కూడా తన మజ్ బత్  స్థానాన్ని నిలబెట్టుకున్నారు. తన ప్రత్యర్థి, జేఎంఎం అభ్యర్థిని 55 వేల ఓట్ల తేడాతో ఆయన ఓడించారు. కాగా.. 2023లో డీలిమిటేషన్  భాగంగా క్రియేట్  చేసిన తాంగ్లా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బికన్ చంద్ర డేకా 54,601 ఓట్ల తేడాతో కాంగ్రెస్  అభ్యర్థి రోహిత్  పరిగాపై విజయం సాధించారు.

 హిమంత డబుల్  హ్యాట్రిక్

సీఎం హిమంత బిశ్వ శర్మ డబుల్‌ హ్యాట్రిక్ సాధించారు. తన నియోజకవర్గం జలుక్ బారిలో వరుసగా ఆయన ఆరోసారి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్‎పై 89,434 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన విజయ దుందుభి మోగించారు. హిమంతకు 1,27,151 ఓట్లు రాగా, బిదిషకు 37,717 ఓట్లు వచ్చాయి. 

ఇదే నియోజకవర్గంలో ఇండిపెండెంట్‎గా పోటీచేసిన దీపికా దాస్‎కు 2,546 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కూడా గల్లంతయింది. కాగా.. 2001 నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల వరకు జలుక్ బారిలో హిమంత అప్రతిహతంగా విజయం సాధించారు. 2001 నుంచి 2011 వరకు కాంగ్రెస్  అభ్యర్థిగా గెలుపొందగా.. 2016 నుంచి 2026 వరకు బీజేపీ అభ్యర్థిగా విజయ ఢంకా మోగించారు.