గ్యారంటీల హోరు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, ప్రతిపక్షాల వ్యూహం

గ్యారంటీల హోరు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, ప్రతిపక్షాల వ్యూహం

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీగా మారాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వ్యూహాలు రూపొందించుకున్నాయి. గ్యారంటీలతో పార్టీలు హోరెత్తిస్తున్నాయి. సీఏఏ, రామ మందిర నిర్మాణం, మోదీ గ్యారంటీలు, న్యాయ్ కాల్ వంటి అంశాలపై బీజేపీ నేతలు ప్రచారం చేస్తుండగా.. న్యాయ్  గ్యారంటీతో అధికార పార్టీకి కౌంటర్ వేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్యకు వెళ్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్ల పాటు ప్రజావ్యతిరేకంగా పాలించిందని ఇండియా కూటమి నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పది ప్రధాన అంశాలపై అధికార, ప్రతిపక్షాలు దృష్టి సారించి ప్రచారం చేస్తున్నాయి. 

మోదీ కా గ్యారంటీ

మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి ప్రధాని పగ్గాలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన ‘మోదీ కా గ్యారంటీ’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. యువతకు ఉద్యోగావకాశాలు, మహిళా సాధికారత, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, సంక్షేమ పథకాలతో ప్రజలందరినీ దేశాభివృద్ధిలో భాగం చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

సీఏఏ, ఆర్టికల్ 370 రద్దు

2019లో రెండోసారి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టికల్ 370 రద్దు చేశామని, ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే దేశవ్యాప్తంగా సీఏఏ అమలు చేస్తామని బీజేపీ చెబుతోంది. యూసీసీ, ఎన్ఆర్ సీ కూడా అమలు చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్  ప్రభుత్వం యూసీసీ అమలుపై చట్టం చేసింది. ఈ హామీలు ఓట్లు కురిపిస్తాయని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు.

రామ మందిర నిర్మాణం

హిందువుల శతాబ్దాల కల రామ మందిర నిర్మాణం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్లే సాకారమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మందిర నిర్మాణంతో ప్రధానంగా నార్త్  బెల్ట్ లో తమ పార్టీకి ఓట్లు పడతాయని వారు భావిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు సైతం ఈ విషయాన్ని ఒప్పుకోవడం విశేషం. ఈ ఏడాది జనవరి 22 అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించిన విషయం తెలిసిందే!

అమృత్ కాల్  వర్సెస్  అన్యాయ్  కాల్

అమృత్ కాల్​లో భాగంగా స్వపరిపాలన, వేగంతో కూడిన అభివృద్ధిని అందించడం, పేదరికాన్ని తగ్గించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మోదీ ప్రభుత్వం పేర్కొంటున్నది. దేశంలో గత పదేండ్లలో పేదరికం తగ్గిందని, పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పింది. మరోవైపు, పదేండ్ల మోదీ పాలనలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు తీవ్రంగా పెరిగాయని, మోదీ పాలన అందించింది అన్యాయ్ కాల్ అని ఇండియా కూటమి విమర్శిస్తున్నది. గత పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానించిందని, ప్రభుత్వ రంగ వ్యవస్థలను తన గుప్పిట పెట్టుకుందని ఇండియా కూటమి నేతలు మండిపడుతున్నారు.

భావజాలంపై పోరాటం

తమ తమ భావజాలంపై బీజేపీ, కాంగ్రెస్  తీవ్రంగా ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రధానంగా హిందూత్వ అజెండాతో బీజేపీ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. అన్ని వర్గాలకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది.

రైతు సమస్యలు, కనీస మద్దతుధర

రైతు సమస్యలపై ఇండియా కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కనీస మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని, తమ కూటమి అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధరకు గ్యారంటీ కల్పిస్తామని నేతలు హామీ ఇస్తున్నారు. మరోవైపు, కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేసిన రైతుల్లో చాలా మంది ప్రతిపక్ష నేతల ప్రలోభానికి గురైన వారేనని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. పీఎం కిసాన్  పథకంతో రైతుల జీవితాల్లో మార్పు తెచ్చామని చెబుతున్నారు.

కాంగ్రెస్  న్యాయ్  గ్యారంటీ

యువత, రైతులు, మహిళలు, కార్మికులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ ‘న్యాయ్  గ్యారంటీ’ తో ముందుకు వచ్చింది. ఆ పార్టీ నేత రాహుల్  గాంధీ తాను చేపట్టిన భారత్  జోడో యాత్రలో న్యాయ్  గ్యారంటీ గురించి ప్రజలకు వివరించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే న్యాయ్  గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన తన యాత్రలో హామీ ఇచ్చారు.

నిరుద్యోగం, ధరల పెరుగుదల

గత పదేండ్లలో బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిందని, అంతేకాకుండా నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యుడికి అందనంత స్థాయిలో పెరిగాయని కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందన్నారు. అయితే, ఎకానమీ పెరిగిందని, ఉద్యోగ కల్పన 
కూడా పెరిగిందని బీజేపీ కౌంటర్  ఇస్తున్నది.

ఎలక్టోరల్  బాండ్ల డేటా

సుప్రీంకోర్టు ఆదేశంతో ఎలక్టోరల్  బాండ్ల డేటాను ఎన్నికల సంఘం తన వెబ్ సైట్ లో పొందుపరిచింది. అయితే, ఎన్నికల సంఘం వెల్లడించిన డేటాలో సరైన వివరాలు లేవని, ఎలక్టోరల్  బాండ్ల స్కీమ్  అతిపెద్ద స్కామ్  అని కాంగ్రెస్  విమర్శిస్తున్నది. దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్  చేస్తున్నది. లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ అంశం హాట్  టాపిక్ గా మారింది. తన ప్రచారంలో ఈ అంశంపైనా కాంగ్రెస్  నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.