తెలంగాణ ద్రోహుల పార్టీ టీఆర్​ఎస్​: బండి సంజయ్​

తెలంగాణ ద్రోహుల పార్టీ టీఆర్​ఎస్​: బండి సంజయ్​
  • బీజేపీ వల్లే ఫామ్​హౌస్​ నుంచి కేసీఆర్​ బయటికు వచ్చిండు
  • మునుగోడులో టీఆర్​ఎస్​కు ప్రజలు బుద్ధిచెప్తరని హెచ్చరిక
  • పార్టీలోకి రావాలని బూర నర్సయ్య​ను కలిసిన బీజేపీ నేతలు
  • ఉద్యమకారులున్న బీజేపీలో చేరడం ఘర్ వాపసీలా ఉంది: నర్సయ్య

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ద్రోహుల పార్టీగా టీఆర్​ఎస్​ మారిందని, నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ వేదికైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు  సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ దోమలగూడలోని బూర నర్సయ్యగౌడ్​ ఇంటికి బీజేపీ సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, స్వామిగౌడ్, జితేందర్​రెడ్డి, గరికపాటి మోహన్ రావు, భిక్షపతి గౌడ్​తో కలిసి సంజయ్ వెళ్లారు. బీజేపీలో చేరాలని బూర నర్సయ్యగౌడ్​ను ఆహ్వానించారు. అనంతరం అక్కడే సంజయ్​ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​ను బూర నర్సయ్యగౌడ్​ లాంటి ఉద్యమకారులు కలిసే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. నర్సయ్యగౌడ్​ నిజాయితీకి మారుపేరని, రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీలో చేరుతున్నారని, ఆయన రాకతో మునుగోడులో బీజేపీ బలం పెరుగుతుందని సంజయ్​ ధీమా వ్యక్తం చేశారు. 

‘‘దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలం చూపడంతోనే  ఫామ్ హౌస్​లోని కేసీఆర్  ప్రగతి భవన్, అక్కడి నుంచి ఢిల్లీకి, చివరికి మునుగోడులో ఒక గ్రామానికి ఇన్​చార్జ్​గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది” అని పేర్కొన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. ‘‘తెలంగాణలో ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో ప్రధాని మోడీ వివరంగా చెప్పడంతోనే రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ మోసం తెలిసివచ్చింది.  గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అన్ని తామే చేశామని చెప్పుకున్న కేసీఆర్ మోసపు  మాటలను తెలంగాణ ప్రజలు తెలుసుకున్నరు. అందుకే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చినా అక్కడి ప్రజలకు పట్టించుకోకుండా బీజేపీని గెలిపించిన్రు. ప్రజలే కాదు టీఆర్ఎస్ నాయకులు కూడా ఆ ఉప ఎన్నికల్లో టీఆర్​ఎస్​ ఓడిపోవాలని కోరుకున్నరు. ఎందుకంటే ఆ ఓటమితోనైనా కేసీఆర్ తమను కలిసే పరిస్థితి ఉంటుందని భావించిన్రు” అని సంజయ్​ అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలకు కేంద్రం ఏం ఇచ్చిందో ఇప్పటికే స్పష్టత ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను మాత్రం కేసీఆర్ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఆయా నియోజకవర్గాలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా సీఎంను బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.

19న బీజేపీలో చేరుత: బూర నర్సయ్యగౌడ్​

ఈ నెల 19 న బీజేపీలో చేరనున్నట్లు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్​ స్పష్టం చేశారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బండి సంజయ్, తరుణ్ చుగ్, కేంద్ర మంత్రుల సమక్షంలో పార్టీలో చేరుతానని ప్రకటించారు. ‘‘ఉద్యమకారులున్న బీజేపీలో చేరడం.. ఘర్ వాపసీలా ఉంది. బీజేపీలోకి రావాలనుకోవడం నా రాజకీయ జీవితం కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే” అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఆహ్వానం మేరకు బీజేపీలో చేరనుండడం సంతోషంగా ఉందని అన్నారు. ‘‘టీఆర్ఎస్ లో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్న. కేసీఆర్ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ను కలవటం‌‌‌‌‌‌‌‌ టీఆర్ఎస్ నేతలకు ఒక ఉద్యమంలా మారింది” అని పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -భువనగిరి లోక్​సభ నియోజకవర్గం అభివృద్ధిలో  కేంద్రం పాత్ర ఎంతో ఉందని చెప్పారు. పార్టీలకు అతీతంగా మోడీ ప్రభుత్వం అభివృద్ధికి  సహకరిస్తున్నదని తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్  నినాదం తనకు నచ్చిందన్నారు.