బలహీనవర్గాలకు బీజేపీ వ్యతిరేకం : మంత్రి పొన్నం

బలహీనవర్గాలకు బీజేపీ వ్యతిరేకం : మంత్రి పొన్నం
  •     మేనిఫెస్టోలో ఒక్కటి కూడా బీసీల అంశాన్ని చేర్చలేదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కులగణన సర్వే చేస్తామని, బలహీనవర్గాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి ఆర్థిక పరిపుష్టి కల్పిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  అన్నారు. కులగణన సర్వే చేసేందుకు కాంగ్రెస్  సిద్ధంగా ఉంటే.. బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. ఆ  పార్టీ బడుగు, బలహీనవర్గాలకు వ్యతిరేకం అని ఆయన మండిపడ్డారు. బీజేపీ మేనిఫెస్టోపై విమర్శలు చేస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 

లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల కోసం 14 అంశాలతో బీజేపీ తమ మేనిఫెస్టో ప్రకటించిందని, అందులో ఒక్కటి కూడా బలహీనవర్గాలకు సంబంధించినది లేదన్నారు. తాము మాత్రం ‘పాంచ్ న్యాయ్’ లో బలహీనవర్గాలకు సంబంధించిన అంశాలను చేర్చామని గుర్తుచేశారు. బీసీ అని చెప్పుకొనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. బీసీల గురించి మేనిఫెస్టోలో ఒక్క అంశాన్ని కూడా పెట్టకపోవడం శోచనీయమన్నారు. 

సంపన్నుల పార్టీగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్  మేనిఫెస్టోలను చదివి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర చేనేత రంగానికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సన్మానాలు అందుకునేటపుడు కాటన్  టవల్స్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేయడం ద్వారా చేనేత కార్మికులను ఆదుకున్నట్లు అవుతుందని మంత్రి సూచించారు.