పుట్టినరోజు వేడుకలో గంజాయి పార్టీ

పుట్టినరోజు వేడుకలో గంజాయి పార్టీ
  • బేగంపేటలోని కలినరీ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీలో స్టూడెంట్ల నిర్వాకం
  • ఆరుగురు విద్యార్థుల అరెస్టు
  • ఇంతకుముందు దొరికినా మార్పు రాలే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఓ కాలేజీలో విద్యార్థులు తమ ఫ్రెండ్  బర్త్ డే రోజు గంజాయి పార్టీ చేసుకున్నారు. హైదరాబాద్ లో బేగంపేటలోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా హోటల్  మేనేజ్‌‌‌‌మెంట్  ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌లో ఈ ఘటన జరిగింది. గంజాయి తీసుకున్న ఆరుగురు విద్యార్థులను శుక్రవారం అరెస్ట్‌‌‌‌  చేశారు. వివరాలను ఈగల్‌‌‌‌  డైరెక్టర్  సందీప్ శాండిల్యా శనివారం వెల్లడించారు. హైదరాబాద్‌‌‌‌కు చెందిన మోహిత్  షాహి (21) గతంలో కర్నాటకలో ఉడుపిలోని  మణిపాల్  యూనివర్సిటీలో హోటల్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ చదివాడు. 

అక్కడ గంజాయి, డ్రగ్స్‌‌‌‌కు అలవాటుపడ్డాడు. కొంతకాలం క్రితం హైదరాబాద్‌‌‌‌ బేగంపేటలోని కలినరీ అకాడమీ ఆఫ్  ఇండియా హోటల్ మేనేజ్‌‌‌‌మెంట్ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌లో జాయిన్  అయ్యాడు. క్యాంపస్‌‌‌‌లోని ఇతర విద్యార్థులకు కూడా  మోహిత్  గంజాయి అలవాటు చేశాడు. వారికి ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ ‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో నివాసం ఉండే  జాసన్‌‌‌‌  గంజాయి సప్లయ్  చేసేవాడు. కాగా.. బ్యాచిలర్‌‌‌‌‌‌‌‌  క్యాటరింగ్  టెక్నాలజీ, కలినరీ ఆర్ట్స్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌  ఇయర్‌‌‌‌‌‌‌‌ చదువుతున్న విద్యార్థులలో ఈ నెల 4న ఒకరి పుట్టినరోజు పార్టీ జరిగింది. పార్టీకి జాసన్  గంజాయి సప్లయ్ చేశాడు. మోహిత్‌‌‌‌  సహా పార్టీలో మొత్తం 11 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పార్టీలో విద్యార్థులు గంజాయి సేవించినట్లు ఈగల్  ఫోర్స్‌‌‌‌కు సమాచారం అందింది. 

సమాచారం అందుకున్న హైదరాబాద్  నార్కోటిక్స్  ఈగల్‌‌‌‌  ఫోర్స్  పోలీసులు.. బర్త్ డే పార్టీకి హాజరైన విద్యార్థులకు శుక్రవారం డోపింగ్  పరీక్షలు నిర్వహించారు. సాక్షి ఎమాలియా (22), మోహిత్ షాహి (21), శుభం రావత్(27),  కరోలినా సింథియా హారిసన్ (19),  ఆరిక్  జొనాథన్  ఆంథొనీ (21),  లాయ్ బారువా (22) కు పాజిటివ్  వచ్చింది. దీంతో ఆరుగురిపై ఎన్‌‌‌‌డీపీఎస్‌‌‌‌  యాక్ట్‌‌‌‌  కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిన్సిపాల్  సుధాకర్  రావుతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో స్టూడెంట్లకు కౌన్సెలింగ్  నిర్వహించారు. తల్లిదండ్రులు అభ్యర్థన మేరకు విద్యార్థులందరినీ డీ-అడిక్షన్  సెంటర్‌‌‌‌కు పంపించారు. 

కాగా.. ఆ విద్యార్థులను గతంలో కూడా ఈగల్  ఫోర్స్‌‌‌‌  పోలీసులు అరెస్టు చేశారు. కాలేజీ యాజమాన్యం సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. అయినా వీరిలో మార్పు రాలేదు. విద్యార్థుల్లో మార్పు వచ్చినట్లు నిర్ధారణ అయితేనే వారిపై క్రిమినల్  కేసును తొలగించేందుకు  చర్యలు తీసుకుంటామని ఈగల్ ఫోర్స్‌‌‌‌  అధికారులు తెలిపారు.