వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు
  • వీక్​గా ఉన్న 40 అసెంబ్లీ సీట్లపై స్పెషల్  ఫోకస్ 
  • నాలుగంచెల వ్యూహం అమలు చేయాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: సౌత్ లో ఎక్కువ లోక్​సభ సీట్లను గెలుచుకోవడంతో పాటు రాష్ట్రంలో ‘మిషన్ 90’ పేరుతో  ముందుకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. బుధవారం హైదరాబాద్​ శివారులోని ఓ రిసార్ట్​లో ప్రారంభమైన ఆ పార్టీ సౌత్​ పార్లమెంట్​  విస్తారక్​ల (ఫుల్​టైమర్స్) సమావేశాలు గురువారం ముగిశాయి.  ఓ వైపు పార్లమెంట్ విస్తారక్ ల మీటింగ్​లతోపాటు ఇంకో వైపు పార్టీ చేరికల కమిటీ, అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశాలు జరిగాయి. సమావేశాల్లో బీఎల్ సంతోష్ తో పాటు పార్టీ రాష్ట్ర ఇన్​చార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, ఇప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలను స్పీడప్ చేయాలని జాతీయ నేతలు ఆదేశించారు. చేరికలను వేగవంతం చేయాలని,  బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో వీక్ గా ఉన్న 40 అసెంబ్లీ సీట్లను గుర్తించిన జాతీయ నాయకత్వం.. అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. పార్టీ నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేయాలని సూచించింది. ఇందులో  భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాలక్, ప్రభారీ, విస్తారక్, కన్వీనర్ ల వ్యవస్థను తీసుకువచ్చింది. నియోజకవర్గంతో సంబంధం లేని సీనియర్ నేతలను ఆయా నియోజకవర్గాలకు పాలక్ లుగా నియమించింది. 

ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పగించింది. దీంతో ప్రతి అసెంబ్లీపై ఓ సీనియర్ నేతను ఇన్​చార్జ్​గా నియమించినట్లయింది. పాలక్ పదవిలో ఉన్న ఆ సీనియర్ నేతనే అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరిస్తారు. అక్కడ పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక వనరులు సమకూర్చడం, పార్టీ క్యాడర్  బాగోగులు చూడడం వంటి ముఖ్య విషయాలపై దృష్టి సారిస్తారు. నెలలో మూడు రోజుల పాటు ఆ నియోజకవర్గంలోనే మకాం వేస్తారు. అక్కడ పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీకి నివేదిస్తారు. రెండు రోజుల కీలక సమావేశాలు బీజేపీ రాష్ట్ర కేడర్​లో కొత్త జోష్​ను తీసుకువస్తాయని పలువురు నేతలు అంటున్నారు.