
ముషీరాబాద్, వెలుగు: మతతత్వ పాలనే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను ధ్వంసం చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. లిబర్టీలోని ఆప్ స్టేట్ ఆఫీసులో బుధవారం ‘భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక వాదాన్ని రక్షించాలి’ అనే అంశంపై వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు.
అనంతరం సుధాకర్మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నియంతృత్వ ధోరణితో రాజ్యాంగంతోపాటు ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని ఖునీ చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను, అసమ్మతివాదులను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. అందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీని ఓడించి, రాజ్యాంగాన్ని, హక్కులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నర్సింగ్ యమున గౌడ్, అధికార ప్రతినిధి జావేద్ షరీఫ్, సోషల్ మీడియా ఇన్చార్జ్సోహేల్, నేతలు టి.రాకేశ్ సింగ్, శివాజీ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.