వచ్చే నెల ఫస్ట్ వీక్​లో బీజేపీ తొలి జాబితా

వచ్చే నెల ఫస్ట్ వీక్​లో బీజేపీ తొలి జాబితా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు మకాం వేసిన ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల ప్రవాసీ ప్రోగ్రామ్ ఆదివారంతో ముగిసింది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ఎమ్మెల్యే గత నెల 20 నుంచి అక్కడే ఉంటూ పార్టీ పరిస్థితిని పర్యవేక్షించారు. బూత్ కమిటీల పనితీరు, స్థానిక బీజేపీ నేతలు  పని చేస్తున్న తీరును తెలుసుకున్నారు. పార్టీ కార్యకర్తలను, అనుబంధ సంఘాల నేతలను, ప్రజలను కలిసి వారి అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్రంలో బీజేపీ మంచి జోష్ ఉన్న సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసే విషయంలో కేంద్రం వెనుకడుగు వేయడంతో తెలంగాణ ప్రజల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననే అనుమానం వ్యక్తం చేయడం ఆయా ఎమ్మెల్యేల దృష్టికి వచ్చింది. 

ఆదివారం మధ్యాహ్నం ప్రవాసీ ప్రోగ్రామ్ కు ముగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి  ఎమ్మెల్యేలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ తరఫున ఏ అభ్యర్థి బరిలో ఉంటే బీజేపీకి గెలుపు అవకాశం ఉంటుందనే దానిపై ఈ ఎమ్మెల్యేలు  హైకమాండ్ కు ఒక  నివేదిక అందించనున్నారు. రాష్ట్రంలో బీజేపీ తరఫున ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంలో ఈ ఎమ్మెల్యేల నివేదికలే కీలకంగా మారనున్నాయని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ లెక్కన వచ్చే నెల మొదటివారంలో బీజేపీ మొదటి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 20 నుంచి 30 మందితో ఈ జాబితా విడుదల అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.