
- వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతరు
హైదరాబాద్, వెలుగు: బ్రిటిష్ వాళ్ల మాదిరిగానే.. బీజేపీ లీడర్లు కులం, మతం పేరుతో దేశంలో చిచ్చుపెడ్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. అందరూ అన్నదమ్ముళ్ల మాదిరి కలిసి ఉండాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. గాంధీ కలలు కన్న రాజ్యం కోసం రాహుల్ ముందుకు వెళ్తున్నారని అన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ జెండాను జగ్గారెడ్డి ఆవిష్కరించారు.
తర్వాత గాంధీభవన్ నుంచి నాంపల్లి వరకు కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. ‘‘గాంధీ ఫ్యామిలీ రాజకీయంగా లేకుండా చేయాలని ప్రధాని మోదీ చూశారు. కానీ.. ప్రజలు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని కూర్చోబెట్టారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించాం. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ను ప్రజలే ప్రధాని కుర్చిలో కూర్చోబెడ్తరు’’అని జగ్గారెడ్డి అన్నారు. త్యాగధనుల చరిత్ర ఈ తరం యువ త తెలుసుకోవాలని సూచించారు.