వేల కోట్ల అప్పుల్లో తెలంగాణ డిస్కంలు

వేల కోట్ల అప్పుల్లో తెలంగాణ డిస్కంలు

దేశంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తానంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై బీజేపీ నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ విభాగం ఇన్ చార్జి అమిత్ మాలవీయ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ తెలంగాణలోని రెండు డిస్కంలు (విద్యుత్ పంపిణీ కంపెనీలు) రూ.11,935 కోట్ల అప్పుల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని ఒక విద్యుత్ ఉత్పత్తి కంపెనీకి కూడా రూ.7,388 కోట్ల అప్పుల్లో ఉంది.  సొంత రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి,  పంపిణీ సంస్థలే అప్పుల్లో ఉన్నప్పుడు.. యావత్ దేశానికి ఉచిత కరెంట్ ఇస్తాననడం కేసీఆర్ కే చెల్లింది’’ అని ఆయన ట్విట్టర్  వేదికగా ఎద్దేవా చేశారు. 

ఈమేరకు విశ్లేషణతో ఓ జాతీయ మీడియా సంస్థ ప్రచురించిన కథనం తాలూకూ వీడియోను తన ట్వీట్ కు జత చేశారు. ‘‘కేసీఆర్ ఒక విఫల ముఖ్యమంత్రి. ఆయన ముందుగా తెలంగాణపై ఫోకస్ చేస్తే బాగుంటుంది’’ అని అమిత్ మాలవీయ సూచించారు. 2024లో కేంద్రంలో బీజేపీయేతర సర్కారు ఏర్పడితే.. దేశంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్ ను అందిస్తామని కేసీఆర్ ఇటీవల నిజామాబాద్ బహిరంగ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే.