డ్రగ్స్‌ తీసుకున్నోళ్లూ నిందితులే .. రూటు మార్చిన పోలీసులు

డ్రగ్స్‌ తీసుకున్నోళ్లూ నిందితులే .. రూటు మార్చిన పోలీసులు
  • డిమాండ్‌  తగ్గించి, సప్లయ్​నియంత్రించేందుకు చర్యలు
  • రాడిసన్‌  కేసులో అందరినీ నిందితులుగానే చూపి విచారణ  ‌

హైదరాబాద్, వెలుగు: రాడిసన్ హోటల్ డ్రగ్స్  కేసులో  డ్రగ్స్  తీసుకున్నోళ్లందరినీ పోలీసులు నిందితులుగా చేర్చారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రముఖ రాజకీయ నేత కొడుకు గజ్జల వివేకానంద, సినీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌  క్రిష్ సహా యూట్యూబర్లు లిషిత, శ్వేత ఇంకా పార్టీలో పాల్గొన్న మొత్తం 10 మందిని కేసులో నిందితులుగా చేర్చారు.

అయితే, గతంలో ఇలాంటి కేసుల్లో డ్రగ్స్  తీసుకున్నవారిని బాధితులుగా, సాక్షులుగా మాత్రమే పరిగణించిన పోలీసులు ప్రస్తుతం రూటు మార్చారు. డ్రగ్స్  డిమాండ్  తగ్గించేందుకు కస్టమర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ కు అలవాటైన వారిలో మార్పు తేవడంతో పాటు డ్రగ్స్  అంటే భయం కలిగించేలా యాక్షన్  ప్లాన్  రెడీ చేశారు. డ్రగ్స్‌‌ తీసుకున్న వారిని బాధితులుగా కాకుండా నిందితులుగా చేర్చుతున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు.

డ్రగ్స్  పార్టీల్లో పాల్గొన్నవారు, డ్రగ్స్‌‌  సప్లయర్లతో  సంబంధాలు ఉన్నవారి గురించి మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గతంలో డ్రగ్స్, గంజాయి తీసుకుంటూ పట్టుబడిన వారిని బాధితులు, సాక్షులుగా మాత్రమే చూపేవారు. డ్రగ్స్‌‌ సప్లయర్‌‌‌‌పై నేరాన్ని నిరూపించేందుకు పోలీసులు వీరిని సాక్షులుగా వినియోగించేవారు. ప్రస్తుతం నార్కోటిక్  డ్రగ్స్  అండ్  సైకోట్రోపిక్  సబ్‌‌స్టాన్సెస్‌‌ (ఎన్‌‌డీపీఎస్‌‌) చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 

టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పోలీస్ యాక్షన్‌‌ షురూ‌‌

సంచలనం సృష్టించిన టాలీవుడ్‌‌  డ్రగ్స్‌‌ కేసులో నిందితుల వద్ద లభించిన ఫోన్‌‌  నంబర్ల ఆధారంగా డైరెక్టర్‌‌  పూరి జగన్నాధ్, నటులు రవితేజ, చార్మి,  రకుల్‌‌ ప్రీత్‌‌  సింగ్  సహా మొత్తం 12 మంది సినీ ప్రముఖులతో పాటు 62  మందిని ఎక్సైజ్‌‌  సిట్‌‌  విచారించింది. ‌‌విచారణ పేరుతో రోజుల తరబడి ఎక్సైజ్  ఆఫీసుకి పిలిపించింది. వారి సాంపిల్స్‌‌  సేకరించి కోర్టులో విచారణ జరిపింది. నాటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్‌‌, గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు ప్రారంభించారు. స్పెషల్‌‌  టాస్క్‌‌ఫోర్స్‌‌ టీమ్స్ ఏర్పాటు చేసి సోదాలు చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్‌‌ సప్లయర్లకి కేరాఫ్ అడ్రెస్‌‌గా ఉన్న నైజీరియన్ల   నెట్‌‌వర్క్​ను నియంత్రించారు. పోలీసుల నిఘాతో హైదరాబాద్‌‌లో డ్రగ్స్  సప్లయర్లు భయపడే పరిస్థితికి వచ్చారు.