ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

గద్వాల, వెలుగు:  రాష్ట్రంలో పేదలకు సరైన వైద్యం అందడం లేదని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ ఆరోపించారు.  బుధవారం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ చౌరస్తా దగ్గర ప్రధాని మోడీ బర్త్ డే  పక్షోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో పేదలకు జనరిక్‌‌‌‌ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిగ్గా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయకపోవడంతో అప్పులు చేసి ప్రైవేట్‌‌‌‌ ఆస్పత్రులకు వెళ్తున్నారని వాపోయారు. తక్కువ ధరకే మెడిసిన్ ఇవ్వాలనే ఉద్దేశంతో జన ఔషధ సంస్థ  మండలానికో  జనరిక్ మెడిసిన్ షాప్‌‌‌‌ను ఏర్పాటు చేస్తోందన్నారు.  ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి , నేతలు బండల వెంకట్ రాములు, రామాంజనేయులు, కృష్ణవేణి, రజక జయశ్రీ, డీటీడీసీ అనిత పాల్గొన్నారు.

డీఈ, ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : మనఊరు–మనబడి పనులను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మనూ చౌదరి హెచ్చరించారు.  బుధవారం కలెక్టరేట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ హాల్‌‌‌‌లో విద్యాశాఖ, పీఆర్‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ అధికారులతో సమీక్షించారు.  కొల్లాపూర్ డివిజన్ పరిధిలో ఎఫ్‌‌‌‌టీవో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన..  డీఈ, ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఈవోను ఆదేశించారు.   ఎంపికైన స్కూళ్లలో పనులు చేపట్టేందుకు  ముందుగానే 5 శాతం నుంచి 15 శాతం వరకు రివాల్వింగ్ ఫండ్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేసినా  పనులు ఎందుకు లేట్‌‌‌‌ అవుతున్నాయని ప్రశ్నించారు.  సిమెంట్, ఇసుక సమస్య కూడా లేదన్నారు.  ఎస్‌‌‌‌ఎంసీ ద్వారా పనులు జరుగుతున్న చోట జాప్యం జరిగితే ఎంఈవో,  సర్పంచులు, కాంట్రాక్టర్లు పనులు చేయిస్తున్న చోట ఏఈలు బాధ్యత బాధ్యత వహించాలన్నారు.  చేసిన పనులకు ఎఫ్‌‌‌‌టీవోలు జనరేట్ చేసి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేస్తే బిల్లులు మంజూరు చేస్తామన్నారు. డీఈవో గోవిందరాజులు, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ ఈఈ భాస్కర్,  పంచాయతీ రాజ్ దామోదర్ రావు పాల్గొన్నారు. 

బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: బాలల హక్కుల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్‌‌‌‌‌‌‌‌  ఏ. దేవయ్య సూచించారు.   బుధవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ మీటింగ్‌‌‌‌ హాల్‌‌‌‌లో జిల్లా అధికారులతో సమీక్షించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే  బాలలు హక్కులు అనుభవించేలా  చూడాలన్నారు. అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల్లో చేరిన పిల్లలకు వారి సామర్థ్యాన్ని బట్టి ఆహారం అందించాలని, ఎలాంటి పరిమితి ఉండొద్దన్నారు.  విద్యుత్, తాగునీటితో పాటు ఆట స్థలాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  

బాలికలు లైంగిక వేధింపులకు గురికాకుండా పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు.    పిల్లలను పనుల్లో పెట్టుకోకుండా,  బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాలల  అన్ని హాస్టళ్లు,  స్కూళ్లలో ఫిర్యాదుల బాక్స్ ను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.  అంతకు ముందు అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను దేవయ్యకు వివరించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా సంక్షేమ అధికారి జరీన బేగం, డీఎంహెచ్‌‌‌‌వో  డాక్టర్ కృష్ణ, డీఈవో రవీందర్, ఇతర శాఖల ఆఫీసర్లు   పాల్గొన్నారు.  

అశాంతి అంతానికి కృషి చేయాలి

నారాయణపేట, వెలుగు: దేశంలోని అశాంతిని అంతం చేసేందుకు మత పెద్దలు ముందుకు రావాలని ఆల్​ఇండియా సూఫీ సజ్జదా నాషిన్​ కౌన్సిల్​ సభ్యులు, అజ్మీర్​ దర్గా బాబా హజ్రత్​ నసీరుద్దీన్ చిస్త్రీ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మెట్రో గార్డెన్‌‌లో ఏఐఎస్‌‌ఎస్‌‌సీ, అష్రఫియా ఎడ్యుకేషన్​ సొసైటీ కొల్లంపల్లి ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతపై రౌండ్​ టేబుల్​సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా  నసీరుద్దీన్‌‌ చిస్త్రీ మాట్లాడుతూ దేశంలో అక్కడక్కడా జరుగుతున్న జాత్యాహంకార ఘటనలు దేశ సమగ్రతకు ప్రమాదకరమన్నారు.  ప్రేమ, శాంతి సందేశాన్ని అందించేందుకు అన్ని మతాల పెద్దలతో కలిసి  దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి మాట్లాడుతూ దేశంలో శాంతి సామరస్యం కోసం ప్రతి ఒక్కరు కలిసి రావాలని కోరారు.   అష్రఫియా సొసైటీ అధ్యక్షుడు జలాల్​ హుసేని, ఏఐఎస్‌‌ఎస్‌‌సీ కౌన్సిల్​ స్టేట్​ కోఆర్డినేటర్​ మౌలానా వహీద్​ పాషా ఖాద్రి, జిల్లా ఎస్పీ ఎన్​.వెంకటేశ్వర్లు, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్​రెడ్డి, కౌన్సిలర్​లు తఖీచాంద్​, అమీరుద్దిన్​,  సొసైటీ  సభ్యులు మహ్మద్​ షఫీ చాంద్​, అబ్దుల్​ సలీం  పాల్గొన్నారు. 

మహిళ కిడ్నాప్

గద్వాల, వెలుగు:వ్యవసాయ పొలం నుంచి ఇంటికి వెళ్తున్న  మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఎస్సై శేఖర్ వివరాల ప్రకారం..  మల్దకల్ మండలం నేతోనిపల్లి తండాకు చెందిన రేణుక(28) బుధవారం  ఓ రైతు పొలంలో కూలీ పనికి వెళ్లింది.  పొద్దుమీకిన తర్వాత తిరిగి ఇంటికి వస్తుండగా... కొందరు వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్‌‌ చేశారు.  భర్త లక్ష్మణ్ నాయక్‌‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.  సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేస్తున్నామని, తెలిసిన వాళ్ల పనిగా అనుమానిస్తున్నామని చెప్పారు.

స్కూటీ అదుపు తప్పి భర్త మృతి, భార్యకు గాయాలు

పెద్దమందడి,  వెలుగు: మండల పరిధిలోని వెల్టూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై  జరిగిన ప్రమాదంలో భర్త చనిపోగా.. భార్యకు గాయాలయ్యాయి.  ఎస్సై హరిప్రసాద్ వివరాల ప్రకారం.. కొత్తకోట మండలం  దంతనూర్ గ్రామానికి చెందిన బోయ తిరుపతయ్య (57) భార్య లక్ష్మితో కలిసి మంగళవారం స్కూటీపై మహబూబ్‌‌నగర్‌‌‌‌ నుంచి  స్వగ్రామమైన పెద్దమందడి మండలం దంతనూరుకు వస్తున్నారు.  వెల్టూర్ దగ్గర స్కూటీ అదుపుతప్పి కింద పడగా భర్త అక్కడికక్కడే మృతి చెందాడు.  భార్య లక్ష్మికి గాయాలయ్యాయి.  భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  వీరికి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు.

ఎర్రవల్లిని మండలం చేయాలి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: గద్వాల జిల్లాలోని ఎర్రవల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని  మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కోరారు. బుధవారం హైదరాబాద్‌‌లో సీఎస్ సోమేష్ కుమార్‌‌‌‌కు వినతి పత్రం అందజేశారు. ఎర్రవల్లిని మండలం చేసేందుకు 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానాలు  చేశాయని వివరించారు. అయినా  కొత్త మండల జాబితాల్లో ఎర్రవెల్లి  లేకపోవడం బాధకరమన్నారు.  ఎర్రవల్లి సర్పంచ్ రవి, అలంపూర్ మండల అధ్యక్షుడు రాము, యూత్ కాంగ్రెస్ నేత శ్యాం ఉన్నారు. 

జాబ్ మేళాలో 28 మంది సెలెక్ట్

వనపర్తి, వెలుగు:హెచ్ సీ ఎల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 28 సెలెక్ట్‌‌‌‌ అయ్యారని  అడిషనల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు.  బుధవారం జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీలో   నిర్వహించిన జాబ్ మేళాకు 108 మంది హాజరయ్యారు.  వీరి సర్టిఫెక్టు పరిశీలించిన హెచ్ సీ ఎల్ టెక్నాలజీ సిబ్బంది 28  మందిని ఎంపిక చేశారు.  ఈ కార్యక్రమంలో డీఐఈవో జాకీర్ హుస్సేన్, ప్రిన్సిపాల్ మద్దిలేటి పాల్గొన్నారు.

లోవోల్టేజ్ సమస్య పరిష్కరించాలి

మక్తల్, వెలుగు: లోవోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని మాగనూరు మండలం నేరడగొం గ్రామానికి చెందిన రైతులు డిమాండ్‌‌‌‌ చేశారు.  బుధవారం మక్తల్‌‌‌‌లోని ఏడీ ఆఫీస్‌‌‌‌ను ముట్టడించారు.  సమస్య పరిష్కారం అయ్యే వరకు సబ్ స్టేషన్ నుంచి విద్యుత్  సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని  సిబ్బందితో వాదనకు దిగారు.  లేదంటే విద్యుత్ వైర్లను పట్టుకుంటామని హెచ్చరించడంతో  సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు .  దాదాపు రెండు గంటలైనా ఏడీ అక్కడికి రాకపోవడంతో  167 అంతర్రాష్ట్ర  రహదారిపై  దర్నాకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ లోవోల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోతున్నాయని వాపోయారు. కరెంట్‌‌‌‌ 9 గంటలు కూడా సరిగ్గా రావడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  గ్రామంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేసినా.. ఇప్పటి వరకు ప్రారంభించలేదన్నారు.  ట్రాఫిక్‌‌‌‌ జామ్‌‌‌‌ కావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పి పంపించారు. ఈ కార్యక్రమంలో రైతులు నాగప్ప, నర్సప్ప ,మొల్ల వలి, వెంకటేశ్, నర్సప్ప ,పూజారి ఆనంద్, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. 

ఆస్పత్రుల్లో కొనసాగుతున్న తనిఖీలు

వనపర్తి, కల్వకుర్తి, వెలుగు:  వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ఆస్పత్రుల తనిఖీలు కొనసాగుతున్నాయి.  బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో డీఎంహెచ్ వో డాక్టర్ రవి శంకర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. అనుమతులు లేని  రక్షపాలి క్లినిక్ ను సీజ్ చేయడంతో పాటు రూల్స్‌‌ పాటించని  వీ కేర్ సాయి క్లినిక్, భారత్ క్లినిక్, జనతా , మెట్రో,  కార్తిక్ డయగ్నస్టిక్,  కొత్తకోటలో విజయ ధన్వంతరి, శ్రీనివాస, విజయ డయగ్నస్టిక్ వారికి నోటీసులు జారీ చేశామని ఆయన తెలిపారు. అలాగే  కల్వకుర్తిలో అర్హత లేని డాక్టర్లను కొనసాగిస్తున్న  ప్రజా కేర్ వెల్, ఒంగోలు క్లినిక్,  శ్రీ సాయి, ద్వారకామయి క్లినిక్‌‌ను  సీజ్ చేసినట్లు నాగర్‌‌‌‌ కర్నూల్‌‌ డిప్యూటీ డీఎంహెచ్‌‌వో ప్రయాంక రాణి తెలిపారు.   ఓం డయాగ్నస్టిక్ సెంటర్‌‌‌‌లో బయో వేస్టేజ్  సదుపాయం లేకపోవడం, ఎస్వీఆర్ డయాగ్నస్టిక్స్ సెంటర్ లో ఎక్స్రే మిషన్‌‌కు పర్మిషన్ లేకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.  

చిన్నోనిపల్లి రిజర్వాయర్‌‌‌‌ను రద్దు చేయాలి

గద్వాల, వెలుగు: రైతులకు అక్కరకు రాని చిన్నోనిపల్లి రిజర్వాయర్‌‌‌‌ను రద్దు చేయాలని తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  244 రోజులుగా రైతుల నిరసన దీక్షకు బుధవారం  సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్‌‌‌‌ ఇక్కడి భూములను ముంచి అవతలి వైపు ఆర్డీఎస్ కు నీళ్లు ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.    రైతులు 244 రోజులు దీక్ష చేయడం చిన్న విషయం కాదని,  న్యాయం జరిగే వరకు తీన్మార్ మల్లన్న టీం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న ఏడు గ్రామాలను ఏపీలో కలిపేశారని,  వీటిని కూడా ఏపీలో కలిపేటట్లు ఉన్నారని విమర్శించారు.  రైతులు ఐక్యంగా ఉండి ముందుకు సాగితే   కేసీఆర్,  కేటీఆర్ ఎంతమంది వచ్చినా ప్రాజెక్టు కట్టలేరన్నారు.  ఈ కార్యక్రమంలో రైతులు రామచంద్ర గౌడ్, గోపాలరావు, మేకల కర్రెప్ప, బడే సాబ్, ఉలిగప్ప, నగేశ్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో రాజ్యమేలుతున్న ఇసుక మాఫియా

మదనాపురం, వెలుగు : రాష్ట్రంలో ఇసుక, నల్లమట్టి మాఫియా రాజ్యమేలుతోందని బీజేపీ  మధ్యప్రదేశ్ ఇన్‌‌‌‌చార్జి మురళీధర్ రావు ఆరోపించారు.  ‘ప్రజాగోస- బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా బుధవారం మండలంలోని దుప్పల్లి, ద్వారకా నగరం, కొన్నూర్, నరసింగాపురం, మదనాపురం, దంతనూరులో బైక్‌‌‌‌ ర్యాలీ నిర్వహించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌  ఎన్నికల సమయంలో ఇచ్చిన  దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి హామీలు తుంగలో తొక్కారని మండిపడ్డారు.  స్థానిక ఎమ్మెల్యే ఏడేండ్లు గడిచినా ఊక చెట్టు వాగు బ్రిడ్జి నిర్మించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వాగులో గల్లంతైన కురుమూర్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.  కరోనా సమయంలో 28 నెలల పాటు రేషన్ బియ్యం ఉచితంగా పంపిణీ చేసిన ఘనత ప్రధాని మోడీదేనన్నారు.  రానున్న ఎన్నికల్లో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కారుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.  అనంతరం మదనాపురం మండల కేంద్రంలో సూరిబాబు ఆధ్వర్యంలో 30 మంది పార్టీలో చేరారు.  ఈ కార్యక్రమంలో మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్ ఇన్‌‌‌‌చార్జి డోకూరు పవన్ కుమార్ రెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాజ వర్ధన్ రెడ్డి, నాయకులు మాధవరెడ్డి, కృష్ణ యాదవ్, విజయేందర్ రెడ్డి, బాబు గౌడ్, నవీన్ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.

ఎండుతున్న పంటలకు  నీరందించాలి

వీపనగండ్ల, వెలుగు :  మండలంలో ఎండిపోతున్న పంటలకు వెంటనే సాగునీరు అందించాలని టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర రావు డిమాండ్​ చేశారు.   బుధవారం సంపత్ రావు పల్లి, కొండూరు, గోప్లాపూర్, సింగవరం,  వెల్టూర్,  పెద్దమారు, చిన్న మార్, చిన్నంబావి  గ్రామాలలోని ఎండిపోయిన పంటలను పరిశీలించారు.  వెంటనే జూరాల ఎడమ కాలువ నుంచి చిన్న మారు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయకట్టు పొలాలకు నీటిని విడుదల చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర మహిళా కార్యదర్శి తిరుపతమ్మ,  జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు రాము యాదవ్,  నేతలు కృష్ణయ్య గౌడ్,  శేఖర్ యాదవ్,  విజయ భాస్కర్ రెడ్డి, సుల్తాన్  పాల్గొన్నారు.

అక్రమార్కులను వదిలిపెట్టం

మహబూబ్ నగర్ , వెలుగు:దివిటిపల్లి డబుల్ బెడ్ రూమ్‌‌‌‌ ఇండ్ల అక్రమార్కులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో డబుల్ బెడ్ రూమ్‌‌‌‌ ఇండ్ల దందా చేసిన అక్రమార్కులను అదుపులోకి తీసుకున్న పోలీసులను ఆయన అభినందించారు.  పేదలెవరూ దళారుల బారిన పడి మోసపోవద్దన్నారు.  డబ్బులిస్తే  డబుల్ బెడ్ రూమ్‌‌‌‌ ఇల్లు ఇస్తామని చెప్పారంటే..   అవి పోర్జరీ, నకిలీ డాక్యుమెట్లేనని అర్థం చేసుకోవాలని సూచించారు.  ఇండ్ల విషయంలో మోసపోయిన వారుంటే సంబంధిత పీఎస్ లో ఫిర్యాదు చేయాలని,  బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.  డబుల్ బెడ్ రూమ్‌‌‌‌ ఇండ్లకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో టేపుపై పూర్తి స్థాయిలో విచా రణ జరపాలని ఎస్పీని ఆదేశించామన్నారు.  

పట్టా పాస్‌‌ బుక్కులు ఇప్పించండి

మిడ్జిల్: వెలుగు: కొత్తూరు, మల్లాపూర్ పరిధిలోని సర్వే నెంబర్‌‌‌‌‌‌‌‌ 311 సమస్యను పరిష్కరించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు.  బుధవారం గ్రామంలో రైతు వేదికను ప్రారంభించేందుకు కొత్తూరుకు వస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని అడ్డుకొని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నెంబర్‌‌‌‌‌‌‌‌ 311లో  రెండు గ్రామాలకు చెందిన 241 మంది రైతులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్నా  కొత్త పట్టా పాస్ బుక్స్ ఇవ్వడం లేదన్నారు. పైగా  సర్వే నెంబర్‌‌‌‌‌‌‌‌ను ధరణిలో ప్రొహిబిటెడ్  లిస్టులో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే  ఇప్పటికే ఆర్డీవో, ల్యాండ్ సర్వే ఏడీతో మాట్లాడానని, మరోసారి మాట్లాడి నాలుగైదు రోజుల్లో  సమస్యను పరిష్కరిస్తామని  హామీ ఇచ్చారు.  

సేవా భావం అలవరుచుకోవాలి

గండీడ్ ,వెలుగు:  యువత సేవా భావాన్ని అలవాటు చేసుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతీ కిరణ్ భూనేటి సూచించారు.  భగత్ సింగ్ జయంతి సందర్భంగా  బుధవారం  మహమ్మదాబాద్ పంచాయతీ కార్యాలయం దగ్గర భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.   అనంతరం  బీజేవైఎం, పాలమూరు బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని  సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుర్వకృష్ణ, గూళ్ల శ్రీనివాస్, బేడి గోపాల్  పాల్గొన్నారు.