మా ఎమెల్యే చచ్చిపోతే బాగుండని జనం అనుకుంటున్నారు

మా ఎమెల్యే చచ్చిపోతే బాగుండని జనం అనుకుంటున్నారు
  • దేశ, విదేశాల్లో ఉన్నోళ్లంతా హుజురాబాద్ రాజకీయాలను గమనిస్తున్నారు 
  • ప్రభుత్వం పేదల కోసం పనిచేయాలి.. కానీ, పెద్దల కోసం పనిచేస్తోంది 
  • పేదలకు ఐదు వేలకు బదులు పదివేల రూపాయల రైతు బంధు ఇవ్వు
  • నేను మొదట ఉద్యమ కారున్ని.. ఆ తర్వాతే మంత్రినయ్యా
  • ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎందుకు గులాం చేస్తున్నారు?
  • కమలాపూర్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్

బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కమలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేశారు. తాను రాజీనామా చేయడంతో ప్రజలను ఆకర్షించడానికి నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన అన్నారు.

మా ఎమెల్యే చచ్చిపోతే బాగుండని జనం అనుకుంటున్నారు

‘హుజురాబాద్‌లో కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని, రేషన్ కార్డులు, ఫించన్లు మంజూరవుతున్నాయని సోషల్ మీడియాలో చూశాను. దాంతో మా ఎమెల్యే రాజీనామా చేస్తే బాగుండని లేకపోతే ఎమ్మెల్యే చచ్చిపోతే బాగుండని అన్ని నియోజకవర్గాల్లో జనం అనుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కష్టపడి అనేక నిధులు ఇప్పించాను. కానీ, రెండు మూడేళ్లుగా చేసిన పనులకే డబ్బులు లేవు. పనులు చేసి నిధులు రాక అప్పులు పాలై.. కొన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లున్నారు. ఇప్పుడేమో ఎన్నికలు వస్తున్నాయని మూడు రోజులుగా ఈ నిధులు విడుదల చేస్తున్నారు. కేసీఆర్ ఈ మధ్య అనేక సభలలో మాట్లాడుతున్నారు. ఆయన మాటలు వింటే ధర్మానికి ప్రతిరూపమని, మాట తప్పని మనిషని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అసలు రంగు వేరే ఉంది. పరకాల ఎమ్మెల్యేతో నీచపు పనులు చేయిస్తున్నాడు. గొప్ప నేతలు, పార్టీలు ఎల్లప్పుడూ ప్రజలనే నమ్ముకుంటారు. కానీ, కేసీఆర్ మాత్రం డబ్బులు, కుట్రలు, మోసాన్ని నమ్ముకుంటాడు. ఆయన ధర్మాన్ని నమ్మరు. ఈ కుట్రలకు హుజురాబాద్ నియోజకవర్గం చరమగీతం పాడబోతోంది.

ఈ ఎన్నిక అహంకారానికి, ఆధిపత్యానికి మధ్య పోరాటం

వందల కోట్లు పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్‌లో గెలవచ్చు. కానీ, హుజురాబాద్‌లో మాత్రం ధర్మమే గెలుస్తుంది. నీ డబ్బులకు, కుట్రలకు ఇక్కడి ప్రజలు లొంగరు. ఇక్కడి ప్రజలు నేను కో అంటే కో అంటారు. నేను ఇక్కడికి వస్తే ప్రజలు అభిమానంతో వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మా ఉప్పల్ గడ్డ రైలో రోకో చేసి సత్తా చాటింది. ఒడ్డెక్కెదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినంక బోడ మల్లన్నలాగా కేసీఆర్ వ్యవహరిస్తారు. గతంలో 2006లో కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు టీఆర్ఎస్‌‌కు ఏ ప్రజాప్రతినిధుల బలం లేకున్నా.. అవతలి పార్టీలు కోట్ల డబ్బులు ఖర్చు చేసినా.. ఉద్యమకారుల అండతో ఆయనను గెలిపించాం. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పోలీసులు, మా ఉద్యమకారులు పోలింగ్ బూతుల దగ్గర కాపలా ఉండి నిన్ను గెలిపించారు. ఇప్పుడు కూడా ఇదే తరహాలో నా విజయాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. నా టీఎన్జీవోలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు నేను గెలవాలని కోరుకుంటున్నారు. ఈ ఎన్నిక అహంకారానికి, ఆధిపత్యానికి మధ్య పోరాటం. ఈ ఎన్నికల్లో నేను గెలిస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలుస్తుంది. దేశ, విదేశాల్లో ఉన్నోళ్లంతా హుజురాబాద్‌ రాజకీయాలను గమనిస్తున్నారు. ఇక్కడ ఈటల గెలవకపోతే తెలంగాణకు అరిష్టమని భావిస్తున్నారు.

పిడికెడు మంది నాయకులు పోవచ్చు.. కానీ లక్షల మంది ప్రజలు నా వెంట ఉన్నారు

గ్రామాల్లో ప్రజాప్రతినిధులు నా వెంట లేకపోయినా.. ప్రజలు నా వెంట ఉన్నారు. పిడికెడు మంది నాయకులు పోవచ్చు.. కానీ, లక్షల మంది ప్రజలు నా వెంట ఉన్నారు. నేను రైతుబంధు వద్దన్నాని, కేసీఆర్ కిట్లు వద్దన్నానని ప్రచారం చేస్తున్నారు. నేను అలా అనలేదు. ప్రభుత్వం పేదల కోసం పనిచేయాలి. కానీ, పెద్దల కోసం పనిచేస్తోంది. అదే అడిగాను. కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తి.. బలహీనంగా ఉండే కొడుకులు, బిడ్డల పట్ల ఆలోచన చేయాలి. ఎస్సీలు, బీసీలు ఉపాధి కోసం లోన్లకు వెళ్తే సర్కారు ఇవ్వడం లేదు. కానీ, ఆదాయ పన్ను కట్టేవాళ్లకు మాత్రం లోన్లు ఇస్తోంది. వందల ఎకరాల భూములన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతుబంధు ఎలా ఇస్తారని మాత్రమే అడిగా. అది తప్పా? ఇప్పటికీ అడుగుతున్నా.. పేదలకు ఐదు వేలకు బదులు పదివేల రూపాయల రైతు బంధు ఇవ్వు. రైసు మిల్లులకు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసే శక్తి లేదని.. ప్రభుత్వమే కొనాలని అడగడం తప్పా? ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు కార్మికులు నా దగ్గరకు వచ్చి మాపై దౌర్యన్యం జరిగితే ఎందుకు ఊరుకుంటున్నారని అడిగారు. అందుకే సంఘాలు ఉంటాయని, అవి పోరాడుతాయని చెప్పాను తప్పా? మంత్రిగా ప్రభుత్వానికి అంతర్గతంగా చాలా చెప్పాను. అయినా విననప్పుడే బయట చెప్పాల్సి వచ్చింది. మున్సిపల్ కార్మికులు 2015-16లో సమ్మె చేస్తే ఓ కలం పోటుతో వారందరినీ తొలగించారు. ఇది తప్పని చెప్పినా వినకపోవడంతో.. బయట మీటింగ్‌లో ఈ సమస్యను అడ్రస్ చేయాల్సి వచ్చింది. ఈటల మంత్రినా, ఉద్యమకారుడా అని అందరూ అనుకున్నారు. నేను మొదట ఉద్యమ కారున్ని, ఆ తర్వాతనే మంత్రినయ్యా. సింగరేణిలో, ఆర్టీసీలో అనేక సంఘాలు స్థాపించి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేశాం. ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్‌ను ఎత్తివేసింది ఈ సర్కారు కాదా? ఆనాడు అవసరమైన సంఘాలు.. ఇప్పుడు ఎందుకు వద్దు. ఇప్పుడు మీకు బానిసలు మాత్రమే కావాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలంటే బీ ఫారాల కోసం అణిగిమణిగి ఉంటారు. కానీ, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా ఎందుకు గులాం చేస్తున్నారు?

అధికార పార్టీ నాయకులు కుల సంఘాలతో డబ్బులు పంచుతున్నారు

డబ్బులను నమ్ముకునే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేను ఆరుసార్లు గెలిచినా.. ఏనాడు ఒక్క రూపాయి ఎవరికీ ఇవ్వలేదు. మద్యం, బ్రాండీషాపు గురించి తెలియదు. ఒక్క రోజు మీకు ప్రలోభ పెట్టే నాయకుడు కావాలా? 365 రోజులు పనిచేసే నాయకుడు కావాలా? అని ప్రజలను ఓట్లడిగాను. హుజురాబాద్‌లో ఓ చీకటి అధ్యాయానికి ఈసారి తెరలేపారు. ఐదుగురు మంత్రులు, పదుల కొద్దీ ఎమ్మెల్యేలు హుజురాబాద్‌లో కులసంఘాలను ప్రలోభపెట్టి డబ్బులు పంచుతున్నారు. సిద్ధిపేటకు పిలిపించుకుని డబ్బులిస్తున్నారు. ఈ డబ్బువాళ్ల అబ్బసొమ్ము కాదు. వాళ్లిచ్చే డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం వేసుకునే వాళ్లకే వేసుకోండి. ప్రజలు మాత్రం ధర్మం తప్పరు. ఓట్ల నమోదులో దొంగ ఓట్లు నమోదు చేసే ప్రమాదం ఉంది. ఉన్నఓట్లను కూడా తొలగించే ప్రమాదం ఉంది. ఈ ప్రక్రియపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బందైనా మీకు అండగా ఉంటా. డబ్బులతో గెలిచిన నాయకులు.. నా ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. మా వాళ్లను ఇబ్బంది పెడితే మాడి మసై పోతారు. ఓయూ జేఏసీ నేత సురేశ్ యాదవ్‌పై దాడి చేశారని తెలిసింది. ఇది దుర్మార్గం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటా హుజురాబాద్‌లో గెలవబోతోంది. బీజేపీ కాషాయ జెండా 2023లో ఎగరబోతోంది. ఇది ఎంతో దూరంలో లేదు. చిన్న చిన్న సమస్యలను పక్కకు పెట్టి.. కార్యకర్తలంతా ఐకమత్యంతో పనిచేయండి. కమలం పువ్వు గుర్తును ఇంటింటికి తీసుకెళ్లేలా కార్యకర్తలు పనిచేయండి’ అని ఈటల పిలుపునిచ్చారు.