అగ్నివీరులకు బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు

అగ్నివీరులకు బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు

మధ్యప్రదేశ్‌ : అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుంటే బీజేపీకి చెందిన సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ పై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్, ఆప్ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. 

అగ్నివీరులకు బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ వివాదాస్పద కామెంట్స్ చేశారు. కేంద్రం ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ అగ్నిపథ్‌పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై కైలాష్ విజయవర్గీయ స్పందించారు. ‘ఒక అగ్నివీర్ సైనిక శిక్షణ పొంది, నాలుగు సంవత్సరాల తర్వాత సేవ నుండి నిష్క్రమించినప్పుడు రూ.11 లక్షలు అందుకుంటాడు. అగ్నివీర్ బ్యాడ్జ్‌ని ధరిస్తాడు. బీజేపీ కార్యాలయానికి సెక్యూరిటీని నియమించాలనుకుంటే, నేను అగ్నివీర్‌కు ప్రాధాన్యత ఇస్తా’ అని అన్నారు.

 దేశ యువత, ఆర్మీని అగౌరవపర్చవద్దు : కేజ్రీవాల్ 
బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ చేసిన కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. కైలాష్ విజయవర్గీయ కామెంట్స్ ను కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, శివసేన పార్టీలు తప్పుపట్టాయి. ‘మన దేశంలోని యువత సైన్యంలోనే చేరేందుకు అహోరాత్రులు కష్టపడతారు. ఎందుకంటే వారు సైన్యంలోకి వెళ్లి దేశానికి సేవ చేయాలనే కోరికతో ఉన్నారు. బీజేపీ కార్యాలయం వెలుపల కాపలాగా ఉండటానికి కాదు’ అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.  

బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ కామెంట్స్ తో అగ్నిపథ్‌ స్కీమ్‌పై ఉన్న అన్ని అనుమానాలు తొలగిపోయాయని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. ‘అగ్నివీరులు సెక్యూరిటీ గార్డులుగా ఉండేందుకు కూడా మన ఆర్మీ శిక్షణ ఇస్తుంది. యూనిఫారంలో ఉన్న వారి ప్రాముఖ్యతను చిన్నచూపు చూస్తున్నారు’ అని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కామెంట్స్ చేశారు.