బీసీ మంత్రిగా నీవేం చేశావో చెప్పు..

బీసీ మంత్రిగా నీవేం చేశావో చెప్పు..

బీసీలకు మోడీ ఏం చేశాడని అడుగుతున్న మంత్రి గంగుల కమలాకర్.. బీసీ మంత్రిగా నీవేం చేశావో చెప్పు అని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం ప్రశ్నించారు. మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ( జులై 4) బీజేపీపై చేసిన విమర్శలను మృత్యుంజయం ఖండించారు. మంత్రి గంగుల మాటల్లో ఆయన ఓర్వలేని తనం స్పష్టంగా బయటపడిందన్నారు. బండి సంజయ్ ను ప్రధాని మోడీ అభినందించడాన్ని చూసి గంగుల ఓర్వలేకపోతున్నారని సెటైర్ వేశారు. "నీకు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఎలాగూ ఇలాంటి అభినందనలు ఉండవు. నీలాంటి చిన్న మెదడున్నోళ్లకు ఇది అర్థం కాదు" అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కోసం మోడీ ఏం ప్రకటన చేశారని ప్రశ్నిస్తున్న గంగుల... తెలంగాణ కోసం మెగా టెక్స్ టైల్ పార్కు ప్రకటించిన విషయం తెలియదా..? అని ప్రశ్నించారు.

కేసీఆర్ కు వంత పాడడం తప్ప మీకు అసలు వ్యక్తిత్వమే లేదంటూ బీజేపీ నేత కటకం మృత్యుంజయం ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఏడేళ్లుగా బీసీలకు రుణాలు అందడం లేదు నీవేం చేస్తున్నావ్?.. గంగుల కమలాకర్ రాష్ట్ర మంత్రిగా కాకుండా ఓ మున్సిపల్ స్థాయి నాయకునిలాగా మాట్లాడుతున్నాడు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం కేంద్రం 180 కోట్లు ఇస్తే.. రాష్ట్ర వాటా ఇప్పటి వరకు 60 కోట్లే ఇచ్చారు. నీవసలు మంత్రివైతే.. మిగతా 120 కోట్లు తీసుకురా" అని కటకం సవాల్ చేశారు. స్మార్ట్ సిటీ కోసం ఇప్పటి వరకు ఎంతెంత ఖర్చు చేసారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. "అసలు మీ ముఖ్యమంత్రి దగ్గర అప్పాయింట్ మెంట్ తీసుకునే దమ్ముందా?.. వారం రోజులు టైమిస్తున్నా... దమ్ముంటే సీఎం దగ్గర అపాయింట్ మెంట్ తీసుకుంటే నీకు సన్మానం చేస్తా" అని మృత్యుంజయం తెలిపారు. 

బండి సంజయ్ కరీంనగర్ శాతవాహనకు 12బి గుర్తింపు తెచ్చారని.. సైనిక్ స్కూల్, ఎస్.ఆర్.ఆర్. కళాశాలకు ప్రత్యేక హోదా తీసుకువచ్చారని కటకం తెలపారు. కరీంనగర్ లో రైల్ ఓవర్ బ్రిడ్జి కోసం బండి సంజయ్ 100 కోట్లు మంజూరు చేయించారని పేర్కొన్నారు. దమ్ముంటే వంతెన కోసం భూసేకరణ చేసివ్వాలని గంగులకు కటకం సవాల్ చేశారు. ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ లాగా పనిచేసే నాయకున్ని నేను చూడలేదని అన్నారు. రాష్ట్రంలో లక్ష టన్నుల బియ్యం పక్కదారి పట్టింది. సివిల్ సప్లై మంత్రిగా నీకు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ఈ బియ్యం గురించి నీవడిగితే.. కేసీఆర్, కేటీఆర్ నీ పదవిని పీకేస్తారు. ఎందుకంటే బియ్యం పైసలన్నీ వాళ్లకేపోయాయని కటకం ఆరోపించారు. మీ ఎమ్మెల్యేలను ముట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. కేసీఆరే ఈ డిసెంబరులో తన ప్రభుత్వాన్ని తానే కూల్చేసుకుంటాడని కటకం జోష్యం చెప్పారు.

ఏదో ఓ రోజు నీవు నిద్రపోయి లేచేసరికి కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేస్తారు. నీ గన్ మెన్లు, కార్లు వెనక్కి పోతాయన్నారు కటకం మృత్యుంజయం. ఇప్పటికే రాష్ట్రాన్ని నడిపేందుకు డబ్బులు లేవు.. బ్రాందీషాపుల నుంచి వచ్చిన రోజువారి పన్నులనే ఇప్పుడు విడతల వారిగా రైతు బంధు ఇస్తున్నారని విమర్శించారు. 700 కోట్ల గ్రానైట్ కుంభకోణంలో నీ పాత్రే పెద్దదని.. ముందు అందులో నుంచి బయటపడి గంగుల మాట్లాడాలని హీతవు పలికారు. గ్రానైట్ కుంభకోణంలో గంగుల జైలుకు పోక తప్పదన్నారు. హరీశ్ రావు మేధావి అనుకున్న.. కానీ ఆయన కూడా చిల్లరగా మాట్లాడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం దుయ్య బట్టారు.