తప్పుచేస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమనే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై బహిరంగ విచారణకు సిద్ధమా అని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు సవాల్ విసిరారు. ‘దండం బెట్టి దరఖాస్తు ఇస్తున్నాం.. నిజాయితీని నిరూపించుకోవాలి’ అని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో జులై 1 నుంచి ఎత్తిపోతలు ప్రారంభమవుతాయని చెప్పి ఆగమేఘాల మీద కన్నెపల్లి వద్ద గత నెలలో సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేశారని, కన్నెపల్లిలోని 11 పంపుల్లో కనీసం ఒక్క పంపైనా ఇప్పుడు పని చేస్తున్నదా అని ప్రశ్నించారు. సుందిళ్ల, అన్నారం, కన్నెపల్లి పంప్‌హౌస్‌ల నిర్మాణంలో మెగా ఇంజనీరింగ్ సంస్థ భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. ఆయా చోట్ల మొత్తం రూ. 150 కోట్లతో ఖర్చయ్యే పంపుల పనిని, రూ. 1800 కోట్లకు చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో పొరపాట్లను రిటైర్డ్ ఇంజనీర్ అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని అన్నారు. 2005-–06లో వంద కోట్ల టర్నోవర్ లేని మెగా ఇంజనీరింగ్ సంస్థ రూ. 30 వేల కోట్లకు ఎదిగిందని, కేసీఆర్ అధికార దుర్వినియోగం వల్లే ఆ సంస్థ అలా ఎదిగిందని ఆరోపించారు. రిటైర్డు ఇంజనీర్లతో కలిసి బీజేపీ బహిరంగ విచారణకు సిద్ధంగా ఉందని, ఇందుకు టీఆర్ఎస్ సిద్ధమా అని ప్రశ్నించారు. తప్పుచేస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమనే కేసీఆర్కా.. సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సీఎం స్పందించకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐతో విచారణ జరపాలని ప్రధానిని కోరుతామని రఘునందన్‌రావు స్పష్టం చేశారు.
