- పేదల ఇండ్లను కూలగొడుతున్నరు.. ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్నరు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపణ
జనగామ, వెలుగు : కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతుగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రూ. వేల కోట్లు పంపిస్తున్నారని ఆరోపించారు. ఇటీవలే బిహార్ ఎన్నికల్లో పంపించినట్లే.. ఇప్పుడు కేరళంలో జరిగే ఎన్నికలకు కూడా డబ్బులు పంపిస్తున్నారన్నారు. చేతిలో గడ్డపార పట్టుకొని పేదల నివాసాలను కూలగొట్టే పనులు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆదివారం జనగామలో నిర్వహించిన పార్టీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండానే చేసినట్లుగా.. సీఎం రేవంత్‌రెడ్డి కేరళంలో గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.రైతులకు రుణమాఫీ, ఇతర సంక్షేమ హామీలు సైతం అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, మంత్రులపైనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని, భవిష్యత్‌లో సంస్థను ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయాయని, భారత్ మాత్రం స్థిరంగా ఉందన్నారు. దేశంలో సరిపడా పెట్రోల్, గ్యాస్ ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
