తెలంగాణకు ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది

తెలంగాణకు ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది

తెలంగాణ విమోచన జరిగి 1998 సెప్టెంబర్‌‌ 17తో 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిజాం కాలేజీ గ్రౌండ్స్‌‌లో బీజేపీ ఆధ్వర్యంలో విమోచన స్వర్ణోత్సవాలు నిర్వహించాం. ఎల్‌‌కే అద్వానీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకల్లో వందల మంది స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించాం. విమోచన పోరాట వివరాలు పాఠ్యాంశాల్లో చేర్చాలని ఏటా అప్పటి గవర్నర్‌‌లు, సీఎంలకు వినతిపత్రాలు ఇచ్చాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల 2 రోజుల తర్వాత హైదరాబాద్​ సంస్థానంలో త్రివర్ణ పతాకం ఎగురవేసే అదృష్టం కలిగింది. హైదరాబాద్‌‌ సంస్థానంలో ప్రజల ఆర్థనాదాలను ఒక్క సర్దార్‌‌ పటేల్‌‌ తప్ప దేశ, విదేశాలు లెక్కచేయలేదు. పటేల్‌‌ సైనిక చర్యతో 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయాడు.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా 2022 సెప్టెంబర్‌‌ 17 నుంచి ఏడాది పాటు ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. మహారాష్ట్ర, కర్నాటక, ప్రభుత్వాల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇకపై ఏటా అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలి.
–చెన్నమనేని విద్యాసాగర్‌‌రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్

దొడ్డి కొమురయ్య మరణంతోనే తిరుగుబాటు
1946 జులై 4న దొడ్డి కొమురయ్య మరణంతో ప్రజల తిరుగుబాటు షురూ అయింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి  విముక్తికి కమ్యూనిస్టుల సారథ్యంలో తిరుగుబాటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. 1946 సెప్టెంబర్‌‌‌‌ 11న కమ్యూనిస్టు పార్టీ పోరాటాన్ని ప్రకటించింది. అప్పటి నుంచి నైజాం, కాశీంరజ్వీ సైన్యానికి, జమీందారుల గుండాలకు వ్యతిరేకంగా జనం పోరాడారు. బలహీనపడుతున్న నిజాం మీదకు 1948 సెప్టెంబర్‌‌‌‌ 13న భారత ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది. జేఎన్ చౌదరీ, నంజప్పల సారథ్యంలో 4 వేల మంది సైన్యంతో వచ్చి సైనిక చర్య చేపట్టారు.  పెద్దగా ప్రతిఘటన లేకుండానే విలీనం జరిగింది. 
–సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు, ఆల్‌‌‌‌ ఇండియా కిసాన్‌‌‌‌ సభ

పటేల్‌‌‌‌ చొరవతోనే.. 
నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్‌‌‌‌ సంస్థానంలో మహిళలు, ప్రజలపై జరుగుతున్న అఘాయిత్యాలు హింసను ఇక్కడి నేతలు నెహ్రూకు చెప్పినా ఆయన వినిపించుకోలేదు. ఇదే సమయంలో బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి డెహ్రాడూన్‌‌‌‌లో ఉన్న సర్దార్‌‌‌‌ పటేల్‌‌‌‌ను కలిసి నిజాం అరాచకాలను వివరించడంతో ఆయన చొరవతోనే సైనిక చర్య మొదలైంది. నిజాం లొంగిపోయాడు. ఇది ముమ్మాటికీ విమోచన దినమే. దీన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేసీఆర్‌‌‌‌ ఇన్నాళ్లు భయపడ్డారు. ఇప్పుడు ప్రధాని మోడీ అధికారికంగా నిర్వహిస్తుండటంతో తన పార్ట్‌‌‌‌నర్‌‌‌‌ అసదుద్దీన్‌‌‌‌ ఓవైసీ చెప్పినట్టు జాతీయ సమైక్యతా దినం అంటున్నడు. సెప్టెంబర్‌‌‌‌ 17 జాతీయ సమైక్యత దినం కానే కాదు. 
–కొండా విశ్వేశ్వర్‌‌‌‌ రెడ్డి, మాజీ ఎంపీ

తెలంగాణకు ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది
75 ఏళ్ల తర్వాతనైనా విమోచన దినోత్సవాలు జరుపుకోవడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్  గత 8 ఏండ్లుగా విమోచన దినోత్సవం జరపకపోవడం బాధాకరం. ఈ ఆలోచన ఆయనకు ఎందుకు రాలేదు?  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని ప్రధాని, కేంద్ర హోం మంత్రిని ఒప్పించి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేశారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది ఇప్పుడేనని అనిపిస్తోంది. 
–మేచినేని కిషన్ రావు, 1969 తెలంగాణ ఉద్యమకారుల సమితి ప్రెసిడెంట్