
పెద్దపల్లి జిల్లా: వరద ఉధృతితో నిరాశ్రయులైన వారికి అండగా ఉంటామన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. గురువారం ఉదయం గోదావరిఖనిలో పర్యటించారు. గతంలో హైదరాబాద్ వరద బాధితులకు రూ.10 వేలు ప్రకటించినట్లుగానే.. ఇప్పుడు కూడా సాయం ప్రభుత్వం సాయం అందించాలన్నారు. నిరాశ్రయులకు టీ, టిఫిన్, ఆహారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇండ్లతో పాటు.. వారి సామాగ్రిని కోల్పోయారన్న వివేక్ వెంకటస్వామి.. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరద బాధితులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ కోరుతుందని చెప్పారు. గోదావరి నదికి భారీగా వరద ప్రవహించడంతో పలువురి ఇళ్ళల్లోకి వరద నీరు చేరి నిరాశ్రయులు అయ్యారు. దీంతో NTPC గోదావరిఖని ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్ లో అధికారులు ఆశ్రయం కల్పించారు. నిరాశ్రయులను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.
పెద్దపల్లి జిల్లాలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గోదావరిఖని- మంచిర్యాల దారిలోని బ్రిడ్జి పై వరద చేరింది. గోదావరిఖని గంగానగర్ దగ్గర ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. నది ప్రవాహాన్ని, గంగానగర్ ప్రాంతాన్ని వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. భారీ వర్షాల క్రమంలో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు. అప్రమత్తంగా ఉండాలని కోరారు. మంచిర్యాల- గోదావరిఖని మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గంగానగర్ లో చెక్ పోస్టు ఏర్పాటు చేసి.... బస్టాండ్ సమీపంలోనే అధికారులు వాహనాలు నిలిపివేస్తున్నారు.