సీఎం కేసీఆర్ రైతులను నిండా ముంచిండు

సీఎం కేసీఆర్ రైతులను నిండా ముంచిండు

నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ పూర్తిగా మరిచిపోయారని బీజేపీ జాతీయ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఢిల్లీలో ధర్నా చేసిన కాళేశ్వరం ముంపు బాధితులకు ఆయన మద్ధతు ప్రకటించారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో చెన్నూరులో 40వేల ఎకరాల్లో రైతులు నష్టపోయారని తెలిపారు. మూడేళ్ల నుంచి ప్రభుత్వం పైసా నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. కాళేశ్వరం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవట్లేదని..ప్రశ్నించిన రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతులను నిండా ముంచారని..కమీషన్ల కోసం ప్రాజెక్టును రీడిజైన్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఓ తుగ్లక్ సీఎం అని విమర్శించారు. ఇక  సీఎం స్పందించకుంటే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

కాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాళేశ్వరం ముంపు నిర్వాసితులు ధర్నా చేపట్టారు. చెన్నూరు నియోజకవర్గానికి చెందిన 50మందికి పైగా రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గత నాలుగేళ్లుగా తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.