
బెంగళూరు: కర్నాటకలో హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని మాజీ మంత్రులు కే.సుధాకర్, ఎస్టీ సోమశేఖర్ ఆరోపించారు. బొమ్మై కేబినెట్లో సుధాకర్ హెల్త్, సోమశేఖర్ కోఆపరేషన్ మంత్రిగా పనిచేశారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీలో చేరిన 17మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో వీరు కూడా ఉన్నారు.
‘‘2018లో జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అప్పుడు సమన్వయ కమిటీ చైర్మన్గా సిద్ధరామయ్య ఉన్నారు. సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగితే తనకేం సంబంధం లేదనేవారు” అని సుధాకర్ తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొడదామని ఎమ్మెల్యేలతో చెప్పేవారని ఆరోపించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సిద్ధరామయ్యే 2019లో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చారని విమర్శించారు..